The South9
The news is by your side.

కొత్త ప్రేమ కథ గులాబీ కి 25 ఏండ్లు

post top

తెలుగు సినిమా ‘గులాబి’ రంగు కొత్త పరికిణి కట్టుకుని సరిగ్గా ఈరోజుకి 25 ఏళ్ళయింది.. కృష్ణవంశీ అనే సృజనాత్మక దర్శకుడు మనకు దొరికింది కూడా ఈరోజే.. ‘గులాబి’ సృష్టించిన సంచలనాలు గుర్తు చేసుకుంటుంటే ఒళ్ళు రొమాంఛితమవుతోంది.. మూస పద్దతిలో సినిమా తీయడాన్ని ‘శివ’ సినిమా బద్దలుకొడితే, ‘గులాబి’ సినిమా అసలు సిసలు సున్నితమైన సహజమైన తెలుగు ప్రేమ కథని ఆవిష్కరించింది.. కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.. ప్రేమికులకు కొత్తగా ప్రేమించుకోవడం నేర్పించింది..
గులాబి సినిమా కథగా చిన్నదే అయినా స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ లలో ఎవ్వరూ అంతవరకు చూడని టెక్నిక్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది, ఒక సరికొత్త అనుభవాన్ని ఇచ్చి మంత్రముగ్ధుల్ని చేసింది.. ఇందుకు ప్రధమ, చివరి రెండు కారణాలు కూడా దర్శకుడు కృష్ణవంశీ మాత్రమే.. ఆయనకది మొదటి సినిమా కావడం కావచ్చు, లేదా ఆయన బాస్ రాంగోపాల్ వర్మలా తనదంటూ కొత్త ముద్ర వేసుకోవాలనే కసి, తపన కూడా కారణం కావచ్చు సినిమా ప్రేమికులకు విందు భోజనం రుచి చూపించాడు.. రాంగోపాల్ వర్మ శిష్యుడైనా కూడా ఆ ముద్ర పడకుండా ఇది ‘కృష్ణవంశీ సినిమా’ అనే కొత్త స్టాంప్ ను తయారుచేసుకోగలిగాడు..
ఇక కథలో విషయానికొస్తే నాటకీయంగా లేని అతి సహజమైన సీన్లు, మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటలు ఉండడం వల్ల ఆ తరం కుర్రకారంతా ఇది మన లవ్ స్టొరీ లాగానే ఉందే అని ఆశ్చర్యపోయి గుండెలకు హత్తుకున్న సినిమా’ గులాబి’..

ఇక అనుకున్న ప్రేమ కథలో ‘అమ్మాయిల్ని ఇతర దేశాలకు అమ్మేయడం’ లాంటి సామాజిక సమస్యని కూడా అతి సహజంగా చేర్చి, అంతే సహజంగా చూపించి మనల్ని షాక్ కి గురిచేసాడు దర్శకుడు.. బహుశా ఈ పాయింట్ కి మూలం ఆరోజుల్లో సంచలన కేస్ ‘అమీనా’ కావచ్చు.. ఇక మేకింగ్ విషయానికొస్తే ఫస్ట్ సీన్లో ఒక క్రైమ్ ఎలిమెంట్, ఆ సీన్ చివర్లో ఒక మహిళకి నిప్పంటించే దృశ్యం హీరోయిన్ ఎంట్రీ షాట్లో మిక్స్ అవుతుంది.. అంటే ఇన్ డైరెక్ట్ గా హీరోయిన్ ఆ సమస్యలో ఇరుక్కోబోతుందని ముందే మనకో హింట్ ఇచ్చాడు.. హీరో ఎంట్రీ కూడా అతని వ్యక్తిత్వాన్ని చూపించేలా ‘క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్టురా’ అనే పాటతో వస్తుంది.. హీరో అల్లరి మనిషే గానీ చిల్లర మనిషి కాదని చెప్పడానికి తండ్రితో చక్కటి రిలేషన్ చూపించారు.. అలాగే బ్రహ్మాజీ తో స్నేహం, ప్రేమికుల్ని తీసుకెళ్లి స్నేహితులు అంతా కలిసి పెళ్లిచేయడం లాంటి బయట రోజూ జరిగే విషయాల్ని దృశ్యరూపంలో చూపించిన మొదటి సినిమా గులాబి.. అలాగని ట్రెడిషన్ కూడా వదల్లేదు కృష్ణవంశీ అనడానికి ఉదాహరణ, ఆ పెళ్లి చేయించాక కొత్త దంపతుల్ని ఇద్దర్నీ ఒక ఇంట్లోకి ఆహ్వానిస్తూ హారతి పళ్లెం పట్టుకుని అడ్డంపడి పేర్లు చెప్పి లోపలికి రమ్మనడం..

ఇక చందు, పూజల లవ్ స్టొరీ అయితే అప్పటివరకు మనం సినిమాల్లో చూడని ఒక కొత్త ఎక్సపీరియన్స్.. ఈ సినిమా 1995 లో రిలీజ్ అయ్యింది, అప్పటికింకా సెల్ ఫోన్లు మనకు రాలేదు. ల్యాండ్ లైన్లు మాత్రమే… ఎక్కడో ఒకచోట శాటిలైట్ ఫోన్లు మాత్రమే ఉండేవి.. అలాంటిది ఆ సినిమాలో పూజ, చందుని వెంటాడుతూ, ఎక్కడపడితే అక్కడ కార్లో కూర్చుని ఫోన్ కాల్స్ చేస్తూ ఏడిపిస్తుంది.. అంత అడ్వాన్స్ గా ఉంటుంది ఆ ట్రాక్.. అలాగే హీరోయిన్ కి పెళ్లి చూపులని తెల్సి నేరుగా వాళ్ళ ఇంటికి హీరో వెళ్లి గోడవపడే సీన్ నాకు తెల్సి అదే మొదటిసారి సినిమాల్లో.. ఒకటా, రెండా ఇలాంటి కొత్త కొత్త సీన్లు ఎన్నెన్నో ఆ సినిమా నిండా.. ఒక అర్ధరాత్రి పూజని తీసుకెళ్లి నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు జరిపిస్తాడు చందు.. అక్కడ పూజతో పాటూ మనం కూడా షాకయ్యేలా సీన్ ఆఖర్లో అది సరిగ్గా చార్మినార్ ముందు అని చూపిస్తాడు దర్శకుడు.. ఆ తర్వాత ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేయసి కోసం ఇలాంటి సర్ప్రైజ్ లు ఎన్నో ప్లాన్ చెయ్యడానికి మూలమైన సీన్ అది..
ఇక ఇంటర్వెల్ బ్యాంగ్… తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే సీన్ అది.. స్నేహం నమ్మకద్రోహమైన క్షణాలు..అది జీర్ణచుకోడానికి ప్రేక్షకులకు చాలా రోజులు పట్టింది..

after image

ఇక ఈ సినిమాలో పాటలు వచ్చే సందర్భాలైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇప్పుడు దర్శకులవుదామనుకునే ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాలి.. ఒకప్పుడు సినిమాల్లో పాట రావడానికి ముందే ‘ఇక్కడ పాట’ అని మనకు తెలిసిపోతుంది.. ఈ సినిమాలో పాట ఎప్పుడొస్తుందో, ఆ తర్వాత సీన్ ఎప్పుడు మొదలైందో గమనించడం కష్టం.. అంతగా సినిమా కథతో, సీన్స్ తో కల్సిపోతాయి పాటలు.. కత్తిపోట్లతో ఉన్న హీరోని తండ్రి, స్నేహితులు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ‘ఏ రోజైతే చూసానో నిన్ను’ అనే పాట మొదలవుతుంది.. అసలిలా ఆలోచించగలగడం, ఆ సందర్భంగా ఒక రొమాంటిక్ పాట పెట్టడం కృష్ణవంశీ కి మాత్రమే చెల్లింది..

ఇక ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ అనే పాట వెనక ఒక చిన్న కథ ఉంది.. నిజానికి ఆ పాట సినిమాలో లేదు.. కానీ ఆడియో క్యాసెట్ లో ఒక పాట తక్కువైతే కేవలం ఆడియో రిలీజ్ కోసం మాత్రమే రికార్డ్ చేశారట.. కానీ విన్న తరువాత ఇంతమంచి పాట సినిమాలో ఎలాగైనా పెట్టాలని నిర్మాత రాంగోపాల్ వర్మ పట్టుబడితే, అప్పుడు కృష్ణవంశీ ఒక సందర్భాన్ని సృష్టించి మరీ ఆ పాట పెట్టారట.. ఆ రకంగా అంతమంచి పాట, దాంతో గాయని సునీత మనకు దొరికినట్టయింది..

అలాగే ఆ సినిమాలో ‘మేఘాలలో’ అనే బైక్ సాంగ్.. బహుశా అరకులోయ లో తీసారు.. ఇప్పుడున్న కొత్త కెమెరా ఎక్విప్మెంట్ ఏదీ లేని రోజుల్లో ఆ పాట అలా తీయడం ఒక అద్భుతమైన ఆలోచన.. క్రేన్లు, డ్రోన్లు లేకుండా తీసిన ఆ షాట్స్ చూస్తుంటే ఇప్పుడు కూడా మతిపోగొట్టేసింది.. టాప్ యాంగిల్ షాట్స్ అన్నీ సినిమా యూనిట్ వాన్ ఎక్కి పైనుంచి షూటింగ్ చేశారట అంత ఇరుకురోడ్లలో.. కృష్ణవంశీ ఆలోచనల్ని రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనంతో మనకు కన్నులవిందుగా ఆవిష్కరించారు.. ఇక శశిప్రీతమ్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం గురించి చెప్పడం కంటే మళ్ళీ ఒకసారి గులాబి సినిమా చూసి మనసారా ఆస్వాదించడం చెయ్యడం మంచిది..
ఇలాంటి ప్రేమికుడు కావాలని జేడీ చక్రవర్తి ని చూసి, ఇలాంటి గడుగ్గాయ్ లాంటి పిల్ల ప్రేయసి కావాలని మహేశ్వరిని చూసి, ఆ రోజుల్లో యూత్ అంతా పిచ్చెక్కిపోయారట..  ఏదేమైనా గులాబి సినిమా వచ్చిన రజతోత్సవ సంవత్సరం లో మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ తల్చుకోవడం బావుంది.. అలాగే కృష్ణవంశీ లాంటి దర్శకుడు ఈ సినిమా ద్వారానే మనకు తెలిసారు కాబట్టి ఆ సినిమా పైన ప్రేమ ఇంకొంచెం పెరుగుతోంది..
లవ్ యూ కృష్ణవంశీ గారూ ?
శుభాకాంక్షలు.. అభినందనలు ?
ప్రముఖ రచయిత- లక్ష్మీ భూపాల

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.