The South9
The news is by your side.
after image

మార్పుకు నాంది కావాలి

ఆయన ఎన్నో యుద్ధాలు, మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తట్టుకుని నిలబడ్డ యోధుడు సంక్షోభాన్ని సైతం అవకాశంగా మార్చుకుని, మళ్లీ బంతిలా పైకి లేచి నిటారుగా నిలబడేంత వ్యూహకర్త. ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన అనుభవశాలి. బిల్‌క్లింటన్-టోనీబ్లెయిర్ వంటి, అంతర్జాయ ఏలికల సరసన కూర్చున్న పరిపాలనా దక్షుడు. ప్రపంచపటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన పాలకుడు. మరిప్పుడు ఆయనకు ఏమైంది? ఆ అనుభవం ఎటు పోయింది? కాంగ్రెస్‌నే ఎదిరించిన ఆయన, భాజపాను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఢిల్లీ బాద్‌షాల కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎందుకు పరితపిస్తున్నారు? ఢిల్లీ దర్బారు పిలుపు కోసం ఎందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి దృష్టిలో తన పార్టీ అంటరానిదిగా ఉన్నా, ఎందుకు అటు వైపు ఆబగా చూస్తున్నారు? ఢిల్లీ పాలకులు అడగకపోయినా, రాజ్యసభలో ఎందుకు అండగా నిలబడుతున్నారు? తన రాజకీయ ప్రత్యర్ధికి భాజపా దన్నుగా నిలిచిందని తెలిసినా, ఎందుకీ దింపుడుకళ్లం ఆశ? ‘ఢిల్లీ జంటను చూస్తే ఎందుకు భయం? ఏమిటీ తాపత్రయం? మరి ఆయన వ్యూహాలు, నాయకత్వ పటిమ ఏమైంది?.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అయిన తెలుగుదేశాధిపతి చంద్రబాబునాయుడు వేస్తున్న గందరగోళ అడుగులపై.. తమ్ముళ్ల మనోగతమిది!

ఎవరి ప్రభ అయినా కాలం కలసివచ్చినంత వరకే వెలిగేది. కానీ, కాలం-ఖర్మంతో పనిలేకుండా అడుగులేసేవారే స్థితప్రజ్ఞులు. ఆ స్థితప్రజ్ఞత కొందరికే ఉందని, అందులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకరన్న భావన, గత కొంతకాలం క్రితం వరకూ అందరిలో ఉండేది. అది అప్పటిమాట. కానీ ఇప్పుడు? ఆయన అడుగుల్లో తడబాటు, భయం, మొహమాటం, ఉనికి కోసం గమ్యం తెలియని పోరాటం, పాత అలవాట్లను మార్చుకోలేని బలహీనత… కలసి వెరసి ఆయన చంద్రబాబు నాయుడవుతున్నారు. రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్ధి వైకాపాను.. గత ఎన్నికల ముందు నుండీ, నేటి వరకూ భాజపానే తెరవెనుక ఉంది. అదే భాజపాతో మిత్రత్వం కోసం బాబు పడుతున్న తాపత్రయం, వెంపర్లాట తమ్ముళ్లకు రుచించడం లేదు. రాజ్యసభలో భాజపా పెట్టే బిల్లులు నెగ్గాలంటే, సభలో బలం ఉన్న వైకాపా ఓట్లు అవసరం. రాష్ట్రంలో భాజపా రెండో స్థానం లోకి రావాలంటే టీడీపీ నిర్వీర్యం కావాలి. ఆ పని వైకాపా విజయవంతంగా అమలుచేస్తున్నందున, ఇప్పట్లో వైకాపాను దూరం చేసుకోవలసిన అవసరం గానీ, శత్రువుగా చేసుకోవలసిన రాజకీయ అనివార్యత గానీ భాజపాకు లేదు. ఎలాగూ జగన్‌పై బోలెడన్ని కేసులు విచారణ దశలోనే ఉన్నందున, ఆయన జుట్టు కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఐటీ-ఈడీ ఇంకా అనేక సంస్థలన్నీ, కేంద్రం చెప్పుచేతల్లోనే ఉంటాయి. కాబట్టి జగన్ గురించి భయపడాల్సిన అవసరం భాజపాకు లేదు. ఇక టీడీపీ ఒకప్పుడు విశ్వసనీయురాలయినప్పటికీ, గత ఎన్నికల్లో బాబు వల్ల తనపై పడ్డ మచ్చను భాజపేయులు మర్చిపోలేరు. విపక్షాలను కూడగట్టి.. ఆ పార్టీలకు ఎన్నికల్లో డబ్బు సాయం కూడా చేసి, ఎన్నికల సమయంలో తనకు ముచ్చెమటలు పట్టించిన చంద్రబాబు చర్యలను, భాజపా రథసారధులు మర్చిపోలేరు. అంటే ఎన్ని ప్రార్ధనలు, అష్టోత్తరాలు, మహాభిషేకాలు, చండీయాగాలు చేసినా ఢిల్లీ బాద్‌షాల మనసు కరగదన్నది ఇప్పటికి సుస్పష్టం. మరి ఈ చిన్నపాటి లెక్క ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అయిన తమ అధినేతకు తెలియదా? అన్నది తమ్ముళ్ల ఆశ్చర్యం.

Post Inner vinod found

అప్ప ఆర్భాటమే తప్ప బావ బతికుంది లేదన్నట్లు.. ఇటీవలి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో, బీజేపీకి జైకొట్టించిన తమ నాయకుడి తీరు చూసి తమ్ముళ్లు తెల్లబోతున్నారు. దానివల్ల తమ పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. ఎన్డీఏ-యుపిఏ అభ్యర్ధులకు ఓటు వేయకపోతే.. కేసీఆర్ మాదిరిగా దూరంగా ఉండాలన్న కనీస ఆలోచన కూడా, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి లేకపోవడంపై పార్టీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వైకాపా ఓటేసిన ఎన్డీఏకు తామూ ఓటు వేస్తే, ఇద్దరికీ తేడా ఏముందన్న భావన ఏర్పడతుందన్న కనీస ఆలోచన లేకపోతే ఎలా? ఈ విషయంలో తన దగ్గరే పాఠాలు నేర్చుకున్న చంద్రశేఖర్‌రావు పాటి స్థితప్రజ్ఞత, చంద్రబాబు ఎందుకు చూపలేకపోయారన్నది తమ్ముళ్ల ప్రశ్న. టీడీపీ ఎంత భజన చేసినా, అందుకోసం ఢిల్లీలో ఎందరిని నియోగించినా, భాజపా కరిగే అవకాశం-అవసరం లేకపోయినా.. తమ నేత ఎందుకు ఆ పార్టీని చూసి వణికిపోతున్నారో, కంగారుపడుతున్నారో అర్ధంకాక తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. తమ నేత పులుకడిగిన ముత్యమయినప్పుడు, ఆయన చేతులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, భాజపాకు భయపడటం ఎందుకున్నది ప్రశ్న. భాజపా ఏం చేస్తుంది? తలదీసి మొల వేస్తుందా? మహా అయితే జైల్లో పెడుతుంది. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాంటి వాళ్లు జైలుకు వెళ్లలేదా? అందాకా ఎందుకు? జగన్ 16 నెలలు జైలుకు వెళ్లలేదా? మొన్నటికిమొన్న చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జెసి ప్రభాకర్‌రెడ్డి జైళ్లకు వెళ్లలేదా? దానికే భయపడితే ఎలాగన్నది తమ్ముళ్ల తర్కం!

గత కొంతకాలం నుంచీ రాష్ట్రంలో తమ పార్టీని కమలదళాలు ఉతికి ఆరేస్తున్నా.. వారిపై ఎదురుదాడి చేయకుండా, తమ చేతులు కట్టివేసిన బాబు తీరుపై తమ్ముళ్లు మండిపడతున్నారు. ‘నాలుగేళ్లు తమతో కలసి అధికారం పంచుకున్న మీకు అప్పటి అక్రమాలలో భాగస్వామ్యం లేదా? ఆ నాలుగేళ్లు పదవులు తీసుకున్న మీరు, అప్పుడెందుకు సంకీర్ణం నుంచి ఎందుకు బయటకు వెళ్లలేద’ని భాజపాను నిలదీసే అవకాశం ఉన్నా.. తమ నోళ్లను బాబన్న కట్టివేయడాన్ని తమ్ముళ్లు సహించలేకపోతున్నారు. కరోనా-చైనాతో యుద్ధ సమయంలో మోదీ మెప్పు కోసం ఆయనను ఆకాశానికెత్తడం, కరోనాపై సలహాలివ్వడం వంటి చర్యలన్నీ.. తాము భాజపాతో మళ్లీ అంటకాగేందుకు చేస్తున్న ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయంటున్నారు.

భాజపా-వైకాపా సహజీవనం చేస్తున్న పరిస్థితిపై.. వైకాపా సానుభూతిపరులలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత ఎంత పెరిగితే, తమ పార్టీకి అంత లాభమంటున్నారు. అయితే తాము కూడా.. మళ్లీ భాజపా వైపే చూస్తున్నామన్న సంకేతాలు వెళితే, అది పరోక్షంగా వైకాపాకే లాభిస్తుందన్న సూత్రం ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’కి అర్ధం కాకపోవడమే వింతంగా ఉందన్నది తమ్ముళ్ల విశ్లేషణ.భూస్థాపితమయిన పార్టీని మళ్లీ నిలబెట్టే ఆలోచన బదులు, భాజపా దన్ను కోసం వెంపర్లాడుతున్న ‘అరువు ఆలోచన’ తమ్ముళ్లకు రుచించడం లేదు. పార్టీలో ఇంకా కులం వాసన-భజన పోలేదన్నది, దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి నేతల మాటలు, టెలికాన్ఫరెన్సుల్లో వినలేక వెగటేస్తుందన్నది తమ్ముళ్ల గోల. ఇలాగయితే ఆంధ్రాలో కూడా పార్టీ పరిస్థితి, తెలంగాణ దారి పట్టడానికి పెద్దగా సమయం తీసుకోదంటున్నారు. పార్టీ కమిటీలే ఇంతవరకూ వేయలేని దుస్థితి చూస్తే.. ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇంకా ‘నాన్చుడు వైఖరి’లోనే జీవిస్తున్నారన్న విషయం అర్ధమవుతోందన్నది తమ్ముళ్ల విశ్లేషణ.

Post midle

Comments are closed.