కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్‌లో అయితే రోజుకు కనీసం 800 నుంచి వెయ్యిదాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భయాందోళనకు గురవుతున్న వ్యాపారులు నగరంలోని తమ వ్యాపార వాణిజ్య సంస్థలకు చాలావరకు స్వచ్ఛందగా లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని.. రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని సర్కారు పెద్దలు సెలవిచ్చారు.
కానీ, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ విధించాలా.. వద్దా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, గతంలో లాక్‌డౌన్ విధించినప్పుడు తీవ్ర ఇబ్బందుల పాలైన నగరవాసులు ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఇప్పటికే ఏపీ వాసులు ఏపీకి, తెలంగాణ వాసులు తమ పల్లెలకు చేరుకున్నారు. ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. అయితే, ఇదే పరిణామం ఇప్పుడు పల్లెలకు ప్రాణసంకటంగా మారింది. నగరంలో ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లక్షణాలు లేకుండా చాలామందికి ఈ మహమ్మారి అంటుకుంది. ఇలాంటి వారు అనేకమంది ఇప్పుడు పల్లెలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు కరోనా అంటే తెలియని పల్లెలు వీరిని చూసి వణికిపోతున్నాయి. ఆ గ్రామానికి చెందిన వారే ఉపాధి, ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాబట్టి వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉండదు. వారు గ్రామంలోకి వస్తే ఎవరి ద్వారా తమ గ్రామానికి కూడా కరోనా సోకుతుందోనన్న ఆందోళనలో అనేక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధింపుపై సర్కారు నిర్ణయం ఆలస్యం అయ్యే కొద్ది పల్లెలకు మరింత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పల్లెజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments are closed.