
2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా స్వేచ్ఛా ప్రపంచం దిశగా 2021 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలకు సైతం ప్రయోజనం చేకూర్చే విధంగా అద్భుతమైన భారతీయ శాస్త్రీయ విజ్ఞానం ముందడుగు వేసింది.
జయహో భారత్…!
2021 కొత్త సంవత్సరం మూడవ రోజున ‘కోవి షీల్డ్’ మరియు ‘కోవాక్సిన్’ అనే రెండు యాంటీ-కోవిడ్ వ్యాక్సిన్లకు భారత ఔషధ నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపడం ఈ ఏడాదిలో ప్రధాన అంశం. దీని కోసం భారతీయులు మాత్రమే గాక, అనేక దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. మానవ జాతి యావత్తు కోవిడ్ -19 మహమ్మారి బారి నుంచి బయట పడేందుకు ఎదురు చూస్తోంది.
గతేడాది ఎదుర్కొన్న చేదు ఘటనల నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆలోచనా అదే దిశగా సాగడం సహజమే. ఈ సందర్భంగా భారత్ ఖ్యాతి ఇనుమడించింది. ఇది శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగే తప్ప, విశ్వాసం కాదు. ఈ ప్రాణాంతక వైరస్ నుంచి ప్రపంచ మానవాళిని రక్షించడంలో భారతదేశం ముందంజలో ఉంది. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సామర్థ్యాన్ని కలిగి ఉండడమే గాక, సొంత వ్యాక్సిన్ ను కూడా తయారు చేసే సత్తాను చాటి చెప్పింది. భారతదేశ స్వదేశీ వ్యాక్సిన్ మొత్తం వైరస్ విధానం ఆధారంగా కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఇది ప్రశంసించదగిన ముందడుగు. దూరదృష్టి, పట్టుదల, ఉత్సాహభరితమైన ప్రయత్నాల ద్వారా ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకున్న వారందరికీ పేరుపేరునా అభినందనలు.
సాంఘిక, ఆర్థిక, భౌగోళిక సరిహద్దులు దాటి విస్తరించిన ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాలు, జీవనోపాధి మార్గాలు అస్తవ్యస్తం అయ్యాయి. గతంలో ఎన్నడూ ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితి సుమారు ఏడాది నుంచి మానవాళిని వెంటాడుతోంది. ఆరోగ్య భద్రత, ఆత్మవిశ్వాసం తో కూడిన భవిష్యత్తు దిశగా టీకాలే రక్షణ కవచాలు. ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ల రూపంలో మానవాళిని రక్షించేందుకు ఉన్నతమైన శాస్త్రీయ విజ్ఞాన ప్రయత్నాలు తెర మీదకు వచ్చాయి. ఇది సంపూర్ణంగా శాస్త్రీయ విజ్ఞానం సాధించిన విజయం. పేదలందరికీ టీకాలు చేరే వరకూ ఈ విజయం పరిపూర్ణం కాజాలదు. ఈ ఆశావహ క్షణాన్ని మరింత ఉత్సాహంతో వేడుకగా నిర్వహించుకోవడానికి ఇది సరైన సమయం కాదు.

అత్యవసర వినియోగం కోసం ఉపయోగించేందుకు రెండు టీకాలకు భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలపడం ఈ వ్యాధిని ఎదుర్కొనే దిశగా తొలి అడుగు. వ్యాధి రహితంగా అవసరమైనంత మందిని ‘వ్యాధి నిరోధకం (ఇన్సులేట్)’గా చేయడం ‘బహుళ ఎంపికల వ్యూహం(మల్టీ ఆప్షన్ స్ట్రాటజీ)’లో ఒక భాగం. స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెందిన నాటి నుంచి గత 100 సంవత్సరాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రపంచంతో కలిసి భారతదేశం కీలక స్థానంలో నిలబడి ప్రయత్నాలు చేస్తోంది.
వ్యాక్సిన్ అభివృద్ధి మరియు నిర్వహణ వంటివి నియమ నిబంధనల ప్రకారం కఠినమైన పర్యవేక్షణ, నిర్వహణలో నిర్దేశించబడతాయి. ఈ మార్గంలో ఏవైనా సమస్యలు ఏర్పడతాయా అనే అంశానికి గానీ, రాజీ పడేందుకు గానీ మనం సిద్ధంగా లేము. రెండు టీకాలకు అనుమతి తెలపడం ద్వారా ఔషధ నియంత్రణ విభాగం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే దిశగా హామీ ఇచ్చింది.

ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది వంటి ముందు వరుస యోధులతో ప్రారంభించి దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ చేరవేసే దిశగా భారత ప్రభుత్వ విధివిధానాలను రూపొందిస్తోంది. ఈ విధానం అవసరం మరియు ప్రాధాన్యతల అంచనాల మీద ఆధారపడి ఉంటుంది.
2020 ఏడాదిలో కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా బారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వ భావన మరో సారి రుజువైంది. మాస్కులు ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరచుకోవడం, సురక్షితమైన దూరాన్ని పాటించడం, ఇంటి వద్ద నుంచే పని చేయడం మరియు కష్టాల్లో ఉన్నవారి ఇబ్బందుల్లో పాలు పంచుకోవడం లాంటి కార్యక్రమాలతో దేశమంతా ఒక్కటే అని ప్రజలు నిరూపించారు. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు జాతీయ నాయకత్వంతో కలిసి ఐక్యతతో పని చేశాయి. అందుకే ఇలాంటి మంచి ఫలితాలు సాధ్యమయ్యాయి. అత్యధిక పరీక్షలు చేయడం, అవసరమైన వస్తువుల ఉత్పత్తి, పి.పి.ఈ. కిట్ల ఉత్పత్తి, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు, పడకల ఏర్పాటు, అత్యవసర అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటివి అనతి కాలంలో చెప్పుకోదగిన స్థాయిలో అనేక రెట్లు పెరిగాయి. ఫలితంగా కోవిడ్ కేసుల నమోదు, మరణాల రేటు విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం మెరుగైన స్థానంలో నిలబడగలిగింది. ఇది 2020లో జాతీయ సంకల్పాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన సందర్బం. 2021లో వ్యాక్సిన్ ను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో కూడా ఈ స్ఫూర్తి కనిపిస్తుందని ఆశిస్తున్నాను.
టీకా ప్రకటన ద్వారా భారతీయ విజ్ఞాన శాస్త్ర ముందడుగు ఆత్మనిర్భర్ భారత్ ఆత్మ యొక్క స్పష్టమైన అభివ్యక్తి. ఇక్కడ స్వావలంబన భారతదేశం తమ ప్రజల కోసం మాత్రమే కాకుండా, ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజల కోసం కూడా పనిచేస్తుందనే మన సనాతన వసుధైవ కుటుంబక భావన మరోసారి రుజవైంది. ఈ క్లిష్టమైన సమయంలో భారతదేశం అందరికీ అండగా నిలబడి తన గొప్పతనాన్ని చాటుకుంది. అందరితో కలిసి పంచుకోవడం, అందరి క్షేమాన్ని కాంక్షించడం అనే భారతీయ సనాతన తత్వాన్ని మరోసారి నిరూపించింది. త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం ద్వారా గతేడాది కష్టాలు, ఆందోళనల నుంచి బయట పడేందుకు ఓ నిర్ధిష్టమైన ప్రారంభాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.
Comments are closed.