కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటూ, దాదాపు 10 రోజులుగా దేశ రాజధాని చుట్టూ అన్ని ప్రాంతాల్లో మోహరించి నిరసనలు తెలియజేస్తున్న ఆరు రాష్ట్రాల రైతు సంఘాలు 8వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. నిన్న సమావేశమైన 35 రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, నేడు కేంద్ర మంత్రులతో మూడవ విడత జరిగే చర్చలపై అనుసరించాల్సిన వైఖరిని కూడా చర్చించారు.
భారత్ బంద్ విషయాన్ని మీడియాకు తెలిపిన భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్, శనివారం నాడు మోదీ ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇదిలావుండగా, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ సైతం రైతులకు మద్దతు పలకడం గమనార్హం. దేశంలో కనీస మద్దతు ధరను రైతులకు అందించే వ్యవస్థను కొనసాగించాల్సిందేనని, అన్ని మండీల్లో ఇదే ధర ఉండాలని, ఆ విధంగా తాజా చట్టాల్లో మార్పులు చేయాలని కోరింది.
ఇక శుక్రవారం రైతు నిరసనలు మరింతగా ఉద్ధృతమయ్యాయి. ముఖ్యంగా టిక్రీ, గాజీపూర్, నోయిడా, సింఘూ సరిహద్దుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తిస్తున్న రైతులు, చలిని సైతం లెక్కచేయకుండా అక్కడే నిద్రిస్తున్నారు. రైతుల నిరసనలతో న్యూఢిల్లీకి సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆగిపోగా, ప్రత్యామ్నాయ మార్గాల్లో నిత్యమూ విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకుంటోంది.
Comments are closed.