

_దిల్లీ : కరోనాతో ఒకప్పుడు అతలాకుతలమైన భారత్‌లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఇక మంగళవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా సోమవారం 7,09,791 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,064 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 17,411 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,28,753కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,00,528 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ మరణాలు ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయాయి. గత 24 గంటల్లో 137 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,52,556 మంది మరణించారు. మరణాల రేటు 1.44శాతంగా ఉంది._
_మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 3,81,305 మందికి కొవిడ్ టీకా అందినట్లు కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 25 రాష్ట్రాల్లో 1,48,266 మందికి టీకా వేసినట్లు పేర్కొంది.._
Comments are closed.