తేదీ: 19-04-2022,
అమరావతి.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్*
*ఏప్రిల్ 21న సీఎం జగన్ చేతులమీదుగా గ్రాసిమ్ ‘ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ’ ప్రారంభం*
*కాస్టిక్ సోడా తయారయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా 2,700 కోట్ల పెట్టుబడులు, 2,450 మందికి ఉద్యోగావకాశాలు*
*75శాతం స్థానికులకు ఉద్యోగులివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించిన గ్రాసిమ్*
*భూగర్భ జలాల కాలుష్కానికి ఆస్కారం లేకుండా యూనిట్ ఏర్పాటుకు పటిష్ట చర్యలు*
*తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఏర్పాటవనున్న యూనిట్*
అమరావతి, ఏప్రిల్, 19 : ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటవనుందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. ఏప్రిల్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా “గ్రాసిమ్ ఇండస్ట్రీ” ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఏర్పాటైన గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా 2,700 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. 75శాతం స్థానికులకు ఉద్యోగులివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కూడా గ్రాసిమ్ అంగీకరించినట్లు తెలిపారు. ఏపీ యువతకు గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి కలిపి మొత్తంగా 2,450 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని మంత్రి తెలిపారు. భూగర్భ జలాల కాలుష్కానికి ఆస్కారమే లేని విధంగా అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని గ్రాసిమ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈ పరిశ్రమపై 24×7 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇది కంబైన్డ్ వాటర్ ట్రీట్ మెంట్, ఎఫ్లూయెంట్‌ను చేర్చడానికి పూర్తిగా సవరించిన డిజైన్‌తో పాటు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సౌకర్యం గ్రాసిమ్ లో ప్రత్యేకంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ట్రీట్‌మెంట్ , రీసైకిల్ ప్లాంట్ ద్వారా సైట్ నుండి ద్రవం సైట్ దాటి బయటకు వెళ్లకుండా..తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ వహించినట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు.
*ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన పరిశ్రమే గ్రాసిమ్ ఇండస్ట్రి*
ఇప్పటికే పులివెందులలోని సంయు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇపుడు మరో పరిశ్రమను ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించి పెట్టుబడుల ప్రవాహానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే విస్కస్ స్టెపుల్ ఫైబర్(వీఎస్ఎఫ్), క్లోర్, ఆల్కలీ తయారీ, సిమెంట్ ఉత్పత్తి, విభిన్న ఆర్థిక సేవల వంటి వాటిలో దిగ్గజ కంపెనీ గ్రాసిమ్. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి. 25, ఆగస్ట్, 1947లో తొలుత ఈ కంపెనీ పేరుని “ది గ్వాలియర్ రేయన్ సిల్క్ మానుఫాక్ఛరింగ్ కంపెనీ లిమిటెడ్”గా నమోదు చేశారు. తదనంతర కాలంలో 1986 సమయంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పేరు మార్పు జరిగింది. ఇప్పటికే గుజరాత్, ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో ఇప్పటికే గ్రాసిమ్ పరిశ్రమకు చెందిన తయారీ యూనిట్లు ఉన్నాయి. అల్యూమినియం సహా నీటి శుద్ధి, వస్త్ర పరిశ్రమ, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు, ఔషధాలు, పల్ప్ , పెప్పర్, విస్కోస్ స్టెపుల్ ఫైబర్, 18 రకాల ఉత్పత్తుల తయారీతో 1000కి పైగా కస్టమర్లతో గ్రాసిమ్ యూనిట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7 క్లోర్ అల్కలీ యూనిట్లు, 2 ఉప్పు ఉత్పత్తి పరిశ్రమలు, 8 కొనుగోలు కార్యాలయాలు, 2 అప్లికేషన్ డెవలప్ మెంట్ కేంద్రాలు నెలకొల్పడంలో ప్రత్యేక ముద్ర వేసింది. కాస్టిక్ సోడా, క్లోర్ అల్కలీ పరిశ్రమ రంగాల్లో భారతదేశంలోనే 29శాతం సామర్థ్యంటో గ్రాసిమ్ పరిశ్రమ ముందంజలో ఉంది.
———–
Comments are closed.