మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు తాజా నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రస్టు ఆధ్వరంలో గడచిన 150 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న ఎంఆర్ ఎయిడెడ్ కాలేజిని అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ట్రస్టు నుండి ప్రభుత్వానికి అభ్యర్ధన అందటమే వివాదానికి కారణమైంది. విజయనగరం రాజులు స్వయంగా నిర్మించి నిర్వహించిన ఈ కాలేజికి మంచిపేరుంది. దీని నిర్వహణంతా ట్రస్టే చూసుకుంటున్నా సిబ్బంది జీతబత్యాలు మాత్రమే ప్రభుత్వమే చూసుకుంటోంది. అంటే సుమారు 150 మంది సిబ్బంది జీతబత్యాల భారం ట్రస్టుపై లేదన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.
మామూలుగా ఎవరైనా అన్ ఎయిడెడ్ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగా మార్చటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒకాసరి ఎయిడెడ్ కాలేజీగా గుర్తిస్తే కాలేజీ నిర్వహణ భారం చాలావరకు తగ్గిపోతుంది. ఎంఆర్ కాలేజీని 1857లో ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 4 వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. విజయనగరం నడిబొడ్డున సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీ స్ధలానికి రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇక్కడ చూడాల్సింది రియల్ ఎస్టేట్ వాల్యూ కాదు. కాలేజీకున్న చరిత్ర, ఏర్పాటు నేపధ్యం, దాన్ని క్రెడిబులిటి మాత్రమే. 4 వేలమంది విద్యార్ధులతో చక్కగా నడుస్తున్న కాలేజీని హఠాత్తుగా అన్ ఎయిడెడ్ గా మార్చాలని ట్రస్టు ఎందుకు నిర్ణయించిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
ట్రస్టు తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు సహజంగానే మండిపడుతున్నాయి. కాలేజీ మొత్తాన్ని మెల్లిగా ప్రైవేటు పరం చేయటానికి ట్రస్టు ఛైర్ పర్సన్ కుట్ర పన్నుతోందంటూ సంచైతా గజపతిరాజుపై ఆరోపణలు మొదలైపోయాయి. అసలే సంచైత ఛైర్ పర్సన్ అయినప్పటి నుండి ట్రస్టు వ్యవహారాలు చాలా వివాదాస్పదమవుతున్నాయి. ట్రస్టు వ్యవహారాలపై పనిగట్టుకుని బురద చల్లుతున్నట్లు సంచైత కూడా ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షంపై మాటలతో ఎదరుదాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఛైర్ పర్సన్ అయిన దగ్గర నుండి సంచైతకు బాబాయ్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, చంద్రబాబునాయుడు, లోకేష్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం అందరు చూస్తున్నదే. మరి తాజా వివాదం వెలుగు చూసిన నేపధ్యంలో సంచైత ఏమని వివరణ ఇచ్చుకుంటుందో చూడాల్సిందే.
Comments are closed.