The South9
The news is by your side.
after image

విశ్వనగరం.. మరో ఇస్తాంబుల్.. నయా సింగపూర్.. అబ్బో ఒకటేమిటి?

post top

అంతర్జాతీయ నగరాలన్నీ కలసి వెరసి హైదరాబాద్‌గా మార్చేస్తామన్నది పాలకులు గత ఆరేళ్ల నుంచి చెబుతున్న, అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు ముచ్చట్లే. లేటెస్టు స్లోగనయితే విశ్వనగరం. కానీ ఇస్తాంబుల్.. సింగపూర్ అక్కడే ఉండగా, మన హైదరాబాద్ ఎప్పటి హైదరా‘బాధ’గానే ఉండిపోయింది. గత రెండు మూడు రోజుల నుంచి కుండపోత వర్షంతో విశ్వనగరం కాస్తా, విషాదనగరమవుతోంది. నగరంలో ఏ డ్రైనేజీనడిగినా, ఏ మోరీ తొంగిచూసినా కనిపించేదీ, వినిపించేదీ పుట్టెడు విషాదమే. భారీ వర్షాల్లో డ్రైనేజీల్లో పడి సజీవ సమాధి అయిన వారి సంఖ్యకు లెక్కేలేదు. కొన్నేళ క్రితం వర్షంలో నడిచొస్తున్న ఓ మహిళ, అంబర్‌పేటలో నోరు తెరచి ఉన్న డ్రైనేజీలో పడి కొట్టుకుపోతే.. ఆమె మృతదేహం ఇంకెక్కడో తేలింది. పది సెంటీమీటర్ల వర్షమొస్తే చాలు.. కార్లు, స్కూటర్లు, ఆటోలు నీళ్లపై తేలియాడుతూ కొట్టుకుపోతూ కనిపిస్తుంటాయి. తాజాగా నగర పాలక సంస్థ వర్షం పడితే ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. అదీ నగర పౌరుడి పరిస్థితి. కొన్నేళ్లుగా పౌరులందరికీ ఈ హైదరాబాధలు అలవాటయిపోయాయి. అందుకే ఎప్పుడు వానొచ్చినా, ఏ విషాద వార్త వినాల్సి వస్తుందేమోనన్న వణుకు. తాజాగా మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో ఓ 12 ఏళ్ల చిన్నారిని, నాలా సైకిల్‌తో సహా మింగేసిన విషాదం నుంచి ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. గతంలో కూడా అక్కడే ఓ మహిళ ఇలాగే కొట్టుకుపోయినా అధికారుల్లో చలనం లేదు. అసలు దీనదయాళ్‌నగర్ నాలాతో, ప్రమాదం పొంచి ఉందని చెప్పినా ఎవరికీ పట్టలేదు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి చెప్పినట్లు, ఇంకా ఇలాంటి విషాదాలు ఇంకెన్ని జరిగితే కేసీఆర్ సర్కారు స్పందిస్తుందో చూడాలి. నిజానికి ఇలాంటి దీనదయాళ్‌నగర్ వంటి ఓపెన్ నాలాలు నగరంలో గజానికొకటి. కేటీఆర్ మునిసిపల్ మంత్రిగా ఎంటరయిన తర్వాత, హైదరాబాద్ నగర రూపు రేఖలు మార్చేస్తామన్న హామీ ఇప్పటికీ చెల్లని రూపాయిగానే కనిపిస్తోంది. నేతల నాటి సుద్దులన్నీ, ఈ వర్షాకాలం సీజన్‌లో సోషల్ మీడియాలో వీడియోలుగా వైరల్ అవుతున్నాయి.

special story about Bhagya nagaram1

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న కేసీఆర్- కేటీఆర్ హామీలను ఎద్దేవా చేస్తూ, ప్రస్తుత పరిస్థితేమిటన్నది ఆ వీడియోలే జవాబిస్తుండటం విశేషం. తెలంగాణ ప్రభుత్వమే కాదు. హైదరాబాద్ నగర పాలక సంస్థ కూడా తెరాస అధీనంలోనే ఉంది. హైదరాబాద్ రూపు రేఖలు మార్చేందుకు, వేల కోట్ల రూపాయలిస్తామని కేసీఆర్-కేటీఆర్ ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప.. చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఈ లోగా ఇలాంటి విషాదాలు శరపరంపరగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో కాకుమాను పెద పేరిరెడ్డి మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఇలాంటి ఘటనలను సుమోటోగా తీసుకుని, నోటీసులిచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మానవ హక్కుల ఉల్లంఘనపై ఎవరూ పెదవివిప్పడం లేదు. కేటీఆర్ మున్సిపల్ శాఖా మాత్యుడిగా వచ్చిన తర్వాత నగరంలో 16.4 కి లోమీటర్ల మేర నాలాలు విస్తరిస్తామన్న పాలకులు, ఇంకా ఆ లక్ష్యానికి 60 శాతం అడుగుల దూరంలో ఉన్నారు. అంటే గమ్యాన్ని ముద్దాడేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు వేసిన కిర్లోస్కర్ కమిటీ.. 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలు విస్తరించాలని, అందుకోసం 10 వేల ఆక్రమణలు తొలగింపుతోపాటు, వీటికి 6700 కోట్లు ఖర్చు అవుతుందని నివేదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆ కమిటీ కొండెక్కింది.

Post Inner vinod found

Golkonda-Fort

మళ్లీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, వోయాంట్స్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ కమిటీ చేసిన సర్వేలో.. 28 వేల ఆక్రమణలు తొలగించాలని, 390 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాలని, అందుకు 12 వేలు కోట్లు ఖర్చవుతుందని నివేదిక ఇచ్చింది. చివరాఖరకు 12,182 ఆక్రమణలున్నట్లు తేల్చింది. 390 కిలోమీటర్ల మేర ఉన్న నాలా ఉండగా, అందులో పైకప్పులున్నవి చాలా తక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆక్రమణలు పెరిగాయన్నమాట. మరి జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందన్నది ప్రశ్న. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్‌కుమార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు పౌరులకు ఓ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎవరైనా సరే.. గుంతలు పడిన రోడ్లు చూపిస్తే బహుమానం ఇస్తామన్నారు. అంటే హైదరాబాద్ రోడ్డు వంగి ముద్దుపెట్టుకోవాలన్నంత అందంగా.. చాలా సొంపుగా ఉంటాయని, అసలు గుంతలే ఉండవన్నది ఆయన కవి హృదయమన్నమాట. ఆయన సవాలుకు జవాబుగా, విపక్షాలు గుంతలుపడ్డ చోట నిలబడి ఫొటోలు దిగడంతో, సోమేష్‌కుమార్ ఇక ఆ సవాలు ముచ్చటే మర్చిపోయారు. ఇప్పుడు తాజాగా సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. వర్షం వస్తే నీళ్లు రాక మంట వస్తుందా అన్న వ్యంగ్యాస్త్రాలు పౌరుల బాధల గాయాలపై కారం చల్లేవే. లాక్‌డౌన్‌లో రోడ్లు వేశామని చెప్పిన మంత్రి గారు చెప్పడం బాగానే ఉంది. మరి 10 సెంటీమీటర్లు కురిసిన తాజా వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, దీనదయాళ్‌నగర్ నాలాలో పడి మృతి చెందిన ఓ చిన్నారి విషాదాన్ని విస్మరిస్తే ఎలా? ఉమ్మడి రాష్ట్రమయినా.. సొంత రాష్ట్రమయినా, పార్టీలు- ఎమ్మెల్యేలు మారుతున్నారే తప్ప, హైదరా‘బాధలు’ మాత్రం కామనయిపోయాయి. అందుకే ఇది విశ్వనగరం కాదు.. విషాద నగరం! కాదంటారా?.

Credit: లావణ్య కావూరి-UK

Post midle

Comments are closed.