*మంత్రి గారికి మా డబ్బుతో చేప పంపిస్తాం : మాజీ ఎమ్మెల్యే మేకపాటి*
*-ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు*
*-చేపల గుంతలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి*
చికెన్ వ్యర్థాలతో సాగు చేసిన చేపల గుంతల్లో పట్టిన చేపను ఈ దందాకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రికి మా స్వంత డబ్బులతో ప్రతి రోజు పంపిస్తామని, అప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆయనే చెబుతారని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సంగం మండలం దువ్వూరు వద్ద సాగు చేస్తున్న చేపల గుంతలను, అందులో వేసి ఉన్న చికెన్ వ్యర్థాలను బుధవారం రాత్రి ఆయన నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సంగం మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో చేపల గుంతలను సాగు చేస్తున్నారని అన్నారు.
అయితే ఈ గుంతల్లో చేపలకు వేసే దాణాకు బదులు చెన్నై, బెంగళూరు నుండి తెచ్చిన చికెన్ వ్యర్థాలను వేస్తూ పెంచుతున్నారని, దీని వల్ల ప్రజారోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బతింటుందని అన్నారు. ఈ చేపల గుంతల్లో సమీపంలో ఉన్న భూములు సైతం ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని, భూగర్భజలాల్లో కలిసి ఈ నీటిని వినియోగించిన ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నారన్నారు.
ఈ చికెన్ వ్యర్థాల విషయంలో గత నవంబర్ లోనే జిల్లా కలెక్టర్ లేఖ ద్వారా తెలియచేయడం జరిగిందని, అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అందరికి ఇక్కడ జరుగుతున్న దందాను వివరించాలనే పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. సంగంలో ఒక నాయకుడు, రవాణా, నగదు లావాదేవీలు చూసే మరోనాయకుడు లక్షలు సంపాదిస్తూ నేరుగా మంత్రి కార్యాలయానికి లెక్కలు చెబుతున్నారని, ఆయన అండతో అధికారులు కూడా వీరిని ఏమి చేయలేకపోతున్నారన్నారు.
ఈ విషయమై నూతనంగా జిల్లాకు వచ్చిన ఎస్పీకి సైతం తెలియచేస్తామని, వారం రోజుల్లోపు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సమాయత్తమవుతారని, మంత్రి, అధికారులు అంతదూరం తెచ్చుకోకుండా వెంటనే ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే ఈ దందాను నిలిపివేయాలని కోరుతున్నామన్నారు.


