South 9 :
నమ్మకమే నష్టమైంది… …
నుడా అనుమతులతో ప్రజలు మోసపోతున్నారా?
నుడా అంటే ప్రజల్లో ఒక విశ్వాసం. ఆ సంస్థ నుంచి అనుమతి పొందిన స్థలాల్లో ఎలాంటి సమస్యలు ఉండవన్న నమ్మకంతో చాలా మంది తమ కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. చట్టపరంగా ఒక లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలంటే భూమి స్వరూపం, రెవెన్యూ మార్పులు, ప్రభుత్వ భూముల జోక్యం వంటి అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది.

అలాగే రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, పార్కులు వంటి మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలి. కానీ ఈ విధానాలు కచ్చితంగా అమలు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా నెల్లూరులో, మాజీ వైస్‌ఛైర్మన్ బాపిరెడ్డి హయాంలో ఒక లేఅవుట్‌కు ఇచ్చిన అనుమతి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కొన్ని కీలక నిబంధనలు పాటించకుండానే అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో భాగం ఒక మైనర్ పేరిట ఉండటం వంటి విషయాలు వెలుగులోకి రావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
నియమాల ప్రకారం రెవెన్యూ అధికారుల అనుమతులు, భూమి మార్పు ప్రక్రియ పూర్తయ్యాకే ఇలాంటి అనుమతులు ఇవ్వాలి. కానీ అవి లేకుండానే ముందుకు వెళ్లినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ, దీనిని సివిల్ వివాదంగా చూపిస్తూ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. నుడా అనుమతి ఉందనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన ప్రజలు ఇప్పుడు సందిగ్ధంలో పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం అత్యంoత అవసరం.


