విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలి:
వైఎస్ జగన్ డిమాండ్
విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేవలం సీఐని సస్పెండ్ చేయడం సరిపోదని ఆయన అన్నారు.
సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను విజయవాడ కృష్ణలంకలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ఈ కేసులో కృష్ణలంక సీఐతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్, రాష్ట్ర డీజీపీ పాత్రపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మే నెలలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఘటనలు జరిగాయని గుర్తుచేసిన ఆయన, క్రాంతికుమార్ ఆత్మహత్య, సాయికృష్ణ లాకప్ డెత్ రెండింటికీ ఒకే సీఐ కారణమని ఆరోపించారు. సాయికృష్ణను మే 9న పోలీసులు తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సమాచారం ఇవ్వకుండా, “నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో” అంటూ అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు.

డీజీపీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని, చివరకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే పోలీసులు స్పందించారని జగన్ అన్నారు. వైఎస్సార్‌సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో సీఐని సస్పెండ్ చేశారని, అయితే హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టడం కంటితుడుపు చర్య మాత్రమేనని విమర్శించారు.

ఈ ఘటనలో సీఐ ఒక్కరే కాకుండా ఏసీపీ, పోలీస్ కమిషనర్, డీజీపీ వరకు బాధ్యత వహించాలని, అందరిపైనా మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు తప్పనిసరిగా జరగాలని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటంలో పూర్తి అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.


