ప్రకాశ్ రాజ్, జోసెఫ్ రావణ్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆరోపణలు
విజయవాడ,జూలై 4: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కుట్రపూరిత ప్రచారం జరుగుతోందని ఆరోపించిన మంత్రి, ప్రకాష్ రాజ్–జోసెఫ్ రావణ్ మధ్య సంబంధాలకు సంబంధించిన ఆడియో లీక్‌లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వీరి వెనుక తాడేపల్లి ప్యాలెస్‌కు చెందిన వ్యవస్థ ఉందని, షెల్ కంపెనీల ద్వారా నిధులు అందుతున్నాయని ఆరోపించారు.

2019–2024 మధ్య రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలపై ప్రకాష్ రాజ్ స్పందించలేదని ప్రశ్నించిన మంత్రి, డాక్టర్ సుధాకర్ మరణం, వీధి సుబ్రహ్మణ్యం హత్య, ఆలయాలపై దాడుల సమయంలో ఆయన ఎందుకు మౌనం వహించారని నిలదీశారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై విష ప్రచారం చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని హెచ్చరించారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే సోషల్ మీడియా ఖాతాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడిన మంత్రి, ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.


