Hyderabad :
Tollywood news
నటీగా నిరూపించుకోవడమే లక్ష్యం.. టాలీవుడ్లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కీర్తి
సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న యువ నటి కీర్తి, టాలీవుడ్లో మంచి అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని తన ఆకాంక్ష అని చెప్పారు.

ఇప్పటివరకు రెండు, మూడు వీడియో ఆల్బమ్‌లలో నటించిన కీర్తి, ఆ అనుభవం తనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే తప్పకుండా తన ప్రతిభను నిరూపించుకుంటానని అన్నారు.
ఇటీవల వీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో “సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ అవార్డు” అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత కష్టపడి మంచి స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో ఉన్నానని చెప్పారు.

టాలీవుడ్లో ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్న కీర్తి, ఇదొక సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు, మూడు చిత్రాల కథలు వింటున్నానని, వాటిలో సరైన కథ, పాత్ర ఎంపిక చేసుకుని త్వరలోనే హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.
మంచి కథలు, అభినయానికి అవకాశం ఉన్న పాత్రలే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన కీర్తి, తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతిభతో పాటు కష్టపడే తత్వమే తన బలమని, త్వరలో ఒక మంచి చిత్రంతో అందరి ముందుకు వస్తాననే నమ్మకం వ్యక్తం చేశారు.


