The South9
The news is by your side.

చేజర్ల రైతులకు నీళ్లు ఇవ్వండి :మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*“చేజర్ల రైతులకు నీళ్లు ఇవ్వండి”— మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండల రైతులకు రెండో కారు పంట సాగు చేసుకునేందుకు అవసరమైన సాగునీరు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సోమశిల జలాశయం మన నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ, దక్షిణ కాలువ ద్వారా నీరు కోరుతున్న రైతులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇటీవల నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో అధికారులు దక్షిణ కాలువ నీటిని కలువాయి మండలం వెదనపర్తి వరకే పరిమితం చేస్తామని చెప్పారని, 22 ఎల్ కాలువ ద్వారా చేజర్ల, మడపల్లి, బోడిపాడు గ్రామాలకు నీరు అందించలేమని పేర్కొన్నారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

after image

గత ఐదేళ్లలో ఎప్పుడూ చేజర్ల మండలానికి నీటిని ఆపిన సందర్భాలు లేవని, నాన్-డెల్టా రైతులకు కూడా పెన్నా డెల్టా రైతులతో సమానంగా నీటిని అందించిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం చేజర్ల, మడపల్లి, బోడిపాడు గ్రామాల్లో సుమారు 1200 ఎకరాల సాగుభూమి నీటి కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

 

రబీ సీజన్ లో పెద్దగా ఆదాయం లేని ఆయా గ్రామాల రైతులకు ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు నీరందిస్తే రెండో పంటతోనైనా కొంత మేర నష్టాలను పూడ్చుకుంటారని, కలువాయి మండలం వెదనపర్తి నుండి దిగువకు చేజర్ల మండలంలోని చేజర్ల, మడపల్లి, బోడిపాడు గ్రామాలకు నీటిని అందించాలన్నారు.

 

మన నియోజకవర్గంలోనే ఉన్న సోమశిల జలాశయం నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి రైతులు రెండో పంట సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. . మే 4వ తేది నీటి విడుదల సమయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు నష్టపోకుండా వెంటనే జోక్యం చేసుకోవాలని మేకపాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.