The South9
The news is by your side.

డా. అజిత వేజెండ్ల, IPS ప్రారంభించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026

post top

 

డా. అజిత వేజెండ్ల, IPS ప్రారంభించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026

నెల్లూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026 ఘన ప్రారంభం

నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026 పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఈ క్రీడా మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. శాంతికి ప్రతీకగా పావురాలను గాల్లోకి వదిలి, త్రివర్ణ పతాకానికి ప్రతీకగా బెలూన్‌లను ఆకాశంలోకి వదిలిన అనంతరం స్పోర్ట్స్ టార్చ్‌ను వెలిగించి మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న ఐదు సబ్ డివిజన్లు, ఏఆర్, హోం గార్డ్స్ మరియు జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) కు చెందిన అధికారులు, సిబ్బంది జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం న్యాయమైన పోటీ, క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పాటించాలనే అంశాలపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

after image

పోలీస్ ఉద్యోగానికి శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అత్యంత అవసరమని, వాటికి క్రీడలే పునాదని జిల్లా ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, సంతోషం, ఉత్సాహం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు ముఖ్యం కాదని, చివరి వరకు పోరాడే క్రీడా స్ఫూర్తి ఉండాలని స్పష్టం చేశారు.

క్రీడలను ఆటవిడుపుగా, ఆనందంగా తీసుకుంటూ సోదరభావంతో, ఆరోగ్యవంతమైన పోటీతత్వంతో, సహృద్భావ వాతావరణంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌ను ఘనంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Post midle

ఈ స్పోర్ట్స్ మీట్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 4×100 మీటర్ల రిలే, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) చ. సౌజన్య, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష, IPS, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలు, డీపీఓ, హోం గార్డ్స్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.