నియోజకవర్గ అభివృద్దికి సహకారం అందించండి : ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

నియోజకవర్గ అభివృద్దికి సహకారం అందించండి
: ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షల మేరకు అవసరమైన అభివృద్ది కోసం తమ సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ అభివృద్దికి అవసరమైన నిధుల గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ది పనులకు సంబంధించిన నిధులతో పాటు నియోజకవర్గంలో రైతాంగం కోసం అవసరమైన హైలెవల్ కెనాల్ నిర్మాణ పురోగతిపై వివరించి పనులు వేగవంతం జరిగేలా చూడాలన్నారు.
సోమశిల జలాశయం ఆఫ్రాన్ పనులతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన హైలెవల్ కెనాల్ పనుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. జలాశయం నుంచి నీటి విడుదల సందర్భంగా కాలువలు, చెరువుల అభివృద్ది కోసం అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు.

సంగం మండలం అన్నారెడ్డిపాళెం, సిద్దీపురం గ్రామాలలో జగనన్న హౌసింగ్ కాలనీలకు సంబంధించి భూసేకరణ చేసిన వారిన నిధులను మంజూరు చేయించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరవుతున్న నిధులతో పాటు ప్రజలు తమ దృష్టికి తెచ్చిన అభివృద్ది పనుల కోసం రూ.20 కోట్ల అదనంగా మంజూరు చేయించాలని కోరారు.
ప్రతి సచివాలయానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరవుతున్న రూ.20లక్షల నిధులను రూ.40లక్షలకు పెంచి అందచేయాలని, దీని ద్వారా అభివృద్ది పనులను పూర్తి చేయవచ్చునన్నారు.
