నెల్లూరులో “ఆపరేషన్ చిన్నారి తల్లి” కార్యక్రమం విజయవంతం
నెల్లూరు టౌన్‌లోని స్వర్ణ వేదిక మండపంలో నిర్వహించిన “ఆపరేషన్ చిన్నారి తల్లి” కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విమెన్స్ సేఫ్టీ వింగ్ IGP బి. రాజకుమారి IPS ముఖ్య అతిథిగా హాజరై మహిళలు, చిన్నారుల భద్రతపై కీలక సందేశాలు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బి. రాజకుమారి, నెల్లూరు జిల్లాలో మహిళా పోలీస్ అధికారుల నాయకత్వం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాధాన్యతను వివరించి, “శక్తి యాప్ మీతో ఉంటే సర్వ శక్తులు మీతో ఉన్నట్టే” అని అన్నారు. నేటి బాలికలు రేపటి నాయకులు అన్న సందేశాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు.
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Women & Child Safety Wing ద్వారా “Educate, Empower, Ensure Safety” అనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శక్తి యాప్ ద్వారా 112 అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇటీవల శక్తి వెబ్సైట్ కూడా ప్రారంభించబడిందని చెప్పారు.

POCSO కేసుల దర్యాప్తులో వేగం పెంచుతూ, 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసే విధానంతో గత ఏడాది 546 మంది నేరస్థులకు శిక్షలు పడినట్లు వెల్లడించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల మాట్లాడుతూ, “Safe Childhood – Sustainable Development” లక్ష్యంతో చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నారుల రక్షణలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమని, పిల్లలకు మంచి–చెడు స్పర్శలపై అవగాహన కల్పించడం అవసరమని అన్నారు.

జిల్లాలో చిన్నారుల భద్రత కోసం పలు చర్యలు చేపట్టారు. అన్ని సబ్డివిజన్లలో 7 శక్తి టీమ్‌లు ఏర్పాటు చేయడం, 118 హాట్స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచడం, పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, బస్టాండ్లలో 3,830 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు అమలు చేస్తున్నారు. అలాగే 3,615 విద్యాసంస్థల్లో Good Touch – Bad Touch అవగాహన కార్యక్రమాలు, 3,348 విద్యాసంస్థల్లో స్వీయ రక్షణ శిక్షణలు అందించారు.
మొత్తం 5,572 శక్తి వారియర్ గ్రూపులు ఏర్పాటు చేసి, 215 మహిళా హాస్టళ్లలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 31,675 మంది విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. POCSO కేసుల్లో బాధితులకు కౌన్సెలింగ్ సేవలు కూడా అందిస్తున్నారు.
ఇక చిన్నారుల భద్రతకు అవరోధాలుగా నిలుస్తున్న నిరక్షరాస్యత, అవగాహన లోపం, అమాయకత్వం, అక్రమ సంబంధాలు, అక్రమ గేమింగ్ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటూ SOS (Sexual Offender Sheets) నమోదు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కరాటే, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముఖ్య అతిథి సత్కరించారు. జిల్లా పోలీస్ అధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులు, శక్తి టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments are closed.