The South9
The news is by your side.
after image

యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

post top

విశాఖపట్నం.

యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి

నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 5 రాష్ట్రాల యువతకు శుభాభినందనలు

నేడు విజేతలుగా నిలిచిన మీరంతా త్వరలో జగజ్జేతలవ్వాలంటూ మంత్రి మేకపాటి ఆకాంక్ష

ఆద్యంతం యువతీయువకుల్లో స్ఫూర్తి నింపేలా సాగిన మంత్రి మేకపాటి ప్రసంగం

Post Inner vinod found

విశాఖపట్నం, నవంబర్, 02; విశాఖపట్నంలో దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్ లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి మేకపాటి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన, ఆచరణా యువత కోసమే..యువతలాగే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా తానూ స్ఫూర్తి పొందినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఆస్ఫూర్తితో ఆయన అప్పటికప్పుడు ఇంగ్లీష్ లో కవిత వినిపించారు. “గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశమేమీ హద్దు కాదు. సముద్రమేం పెద్ద లోతూ కాదు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా …కన్నీళ్లే సుడిగండంగా మారినా..మంచైనా.. చెడైనా వెనుతిరిగి చూడవద్దు. ఎక్కడా ఆగిపోవద్దు. మీ ఆలోచన, మీ ఆచరణే మీ హద్దు” అంటూ మంత్రి మేకపాటి తన ప్రసంగం ద్వారా యువతలో స్ఫూర్తి నింపారు. అంకితభావంతో ఏదైనా చేయండి..విజయం మీదేనంటూ యువతలో ఉత్సాహపరిచారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయుకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాటపటిమతో జగజ్జేతలుగా నిలవాలన్నారు. నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 500 మంది యువతీయువకులు భారతదేశాన్ని నడిపించే స్థాయికి చేరాలన్నారు.

Post midle

ఎన్ఎస్డీసీ, ఏపీఎస్ఎస్డీసీ సంయుక్తంగా యువత సత్తా చాటే వేదికను ఏర్పాటు చేయడాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. వీటి వల్ల యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటి వరకూ 17.87 లక్షల మంది అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్ సైట్ లో నమోదై శిక్షణ పొందడం అందుకు నిదర్శనమన్నారు. 11సంస్థల భాగస్వామ్యంతో వివిధ నైపుణ్య వేదికలను ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి నైపుణ్యమున్న యువతను వెలికితీయడాన్ని ప్రశంసించారు. 2019 వల్డ్ స్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య కార్యక్రమంలో రష్యా లోని కజాన్ లో నిర్వహించిన నైపుణ్య పోటీలలో 63 దేశాలు పాల్గొనగా అందులో భారత్ 13వ స్థానంలో నిలిచిందన్నారు. 2022 అక్టోబర్ లో చైనాలోని షాంగైలో నిర్వహించే ప్రపంచ స్థాయి పోటీలలో మరింత సత్తాచాటి పురస్కారాలు అందుకోవాలని మంత్రి మేకపాటి ఆకాంక్షించారు.

నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం, ప్రస్తుతం డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించడం, కొత్త నైపుణ్యాలను సృష్టించడంలో ప్రపంచ స్థాయిలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. ఫ్లిప్ కార్ట్, టీవీజీ గ్రూప్, డెల్ టెక్నాలజీస్, జేబీఎమ్ ఆటో లిమిటెడ్, సీఐఐ వంటి ప్రఖ్యాత వంటి పరిశ్రమలు కోరుకున్న నైపుణ్య యువతను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఏపీఎస్ఎస్డీసీ ఎన్నో జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేలాది మంది రాష్ట్ర యువతకు ఉపాధి అందింస్తోందన్నారు. దేశంలో యువతకు ఉద్యోగాలిచ్చే మొదటి 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలవడం గర్వించదగ్గ విషయంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువత ఆశయాలను నెరవేర్చుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాడ్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలకు 5 రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా పోటీదారులు పాల్గొంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ప్రపంచస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యంతో ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే చదువుతోపాటు అదనపు నైపుణ్యాలు ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల ప్రకారం శిక్షణా కార్యక్రమాలను ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేస్తుందని ఆయన అన్నారు.

అంతకుముందు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి నైపుణ్య పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఐదు రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. యువతకు చదువుతోపాటు అదనపు నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయలని ఆదేశించారని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని జయలక్ష్మి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున్, ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార రాజు, వల్డ్ స్కిల్స్ ఇండియా డైరెక్టర్ ప్రకాశ్ శర్మ, కల్నల్ అరుణ్ చందేల్ తదితరులు పాల్గొన్నారు

Post midle

Comments are closed.