Kavali:
కావలిలో విజిలెన్స్ అధికారులతో వివాదం.. చర్చనీయాంశంగా మారిన ఘటన
కావలి పట్టణంలో విజిలెన్స్ అధికారులు నిర్వహిస్తున్న విచారణ సందర్భంగా చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో, గురువారం రాత్రి కావలిలో డేటా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న విజిలెన్స్ అధికారులకు, కావలి ఏరియా వైద్యశాల డైరెక్టర్ చవల రామకృష్ణతో పాటు మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం విజిలెన్స్ అధికారులు కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అసలు ఏం జరిగిందనే అంశంపై స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది. విధుల్లో ఉన్న అధికారులతో జరిగిన వ్యవహారం, ఆ సమయంలో అక్కడికి వచ్చిన వారి పాత్రపై వివిధ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ఏరియా వైద్యశాలలో జర్నలిస్టులు, రోగుల బంధువులతో వివాదాలు చోటుచేసుకున్నాయని కొందరు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ఘటనపై పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కావలి పట్టణంలో ఈ ఘటన రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


