మనుషులకు కొత్తరకం బర్డ్‌ఫ్లూ…రష్యాలో వెలుగుచూసిన కేసులు..!
బర్డ్‌ఫ్లూలో ‘హెచ్5ఎన్8’ అనే కొత్త రకం మానవుల్లోకి వ్యాపించింది. ప్రపంచంలో తొలిసారిగా రష్యాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇది పక్షుల నుంచి పాకింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలియజేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. గత కొద్దినెలల్లో హెచ్5ఎన్8 రకం రష్యా, ఐరోపా, చైనా, పశ్చిమాసియాలోని కోళ్ల పరిశ్రమలో విజృంభిస్తోంది. మానవుల్లో కనిపించలేదు. ఇతర రకాలైన హెచ్5ఎన్1, హెచ్7ఎన్9, హెచ్9ఎన్2 ఇప్పటికే మనుషుల్లోకి పాకాయి. ఇప్పుడు హెచ్5ఎన్8 కూడా ఈ కోవలోకి చేరినట్లు వెల్లడైంది. రష్యాలోని ఒక పౌల్ట్రీ కేంద్రంలో ఏడుగురు కార్మికులకు ఇది సోకిందని అధికారులు తెలిపారు. అయితే బాధితుల పరిస్థితి బాగానే ఉందన్నారు. వ్యాధి సోకిన లేదా చనిపోయిన పక్షులను తాకడం వల్ల మానవుల్లోకి బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. చికెన్‌ను సరిగా వండి, తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
Comments are closed.