*72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ శకటం ప్రదర్శన ; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధించిన పరిశ్రమల ప్రగతి..నిర్దేశించుకున్న పారిశ్రామికా లక్ష్యం గురించి*
అదిగదిగో.. వచ్చేస్తున్నాయ్ పారిశ్రామిక ప్రగతిరథ చక్రాలు..మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే ఇరుసుగా చేసుకుని ముందుకు సాగుతోన్న అసలైన పారిశ్రామిక సంక్షేమాభివృద్ధి పట్టాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక క్షేత్రం. ఎలాంటి పరిశ్రమ స్థాపనకైనా స్నేహపూర్వక వాతావరణం. సకల మౌలిక సదుపాయాలు పుష్కలం. సహజ వనరులు అపారం. వెరసి.. ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెడుతున్న పరిశ్రమలు. పరవళ్లు తొక్కుతున్న పెట్టుబడులు. అవినీతికి అవకాశం లేని పారదర్శక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. ప్రజలు హర్షించే సంస్కరణలు, జనం గర్వించే నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాంధ్రప్రదేశ్ గా పరిఢవిల్లుతోంది.
సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కే అగ్రస్థానం. తాజా సర్వే ప్రకారం 2020-21 ఏడాది 3వ త్రైమాసికంలో కాలంలో అత్యధిక పెట్టుబడులను, సరికొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో దేశంలోనే రెండో స్థానం. అందుకే, ఏపీ అంటే పెట్టుబడుల గమ్యస్థానం. పరిశ్రమలకు స్వర్గధామం.
కరోనా విపత్తు సమయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 11,238 యూనిట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.905 కోట్లు ప్రోత్సాహక బకాయిలను “రీస్టార్ట్” ప్యాకేజీ ద్వారా విడుదల చేయడం, విద్యుత్ ఛార్జీల చెల్లింపులలోనూ వెసులుబాటు కల్పించడం ఓ రికార్డ్.
“ఎప్పటికెయ్యది ప్రస్తుత” అన్న ‘సుమతీ’ శతక పద్యంలా అప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా ఆలోచనలు..మార్పుకు తగ్గ ఆచరణలు చేయగల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందనడానికివే సంకేతాలు.
“మౌలిక వసతులు అందిస్తే చాలు. పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి”అని బలంగా నమ్మే సంచలన, సాహసోపేత నిర్ణయాల ముఖ్యమంత్రి..’వసతుల కల్పన’కే కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో నిజం చేయగల సంపూర్ణ అవగాహన గల సమర్థవంతమైన పరిశ్రమల శాఖ మంత్రి. నిబద్ధతతో నిరాడంబరంగా అన్నీ చక్కబెట్టే అధికార యంత్రాంగం. సమిష్టి కృషి సమస్త సమన్వయంతో 2019 జూన్ నాటి నుంచి ఇప్పటివరకూ 1,01,667 ఉద్యోగాలను అందించడమేగాక…రూ.28,242 కోట్ల పెట్టుబడుల రూపంలో 13,170 యూనిట్ల మన రాష్ట్రంలో స్థాపించడం సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం .


2019-2020కి గానూ ఏపీ లక్షా 50వేల కోట్ల విలువైన ఎగుమతులు చేసి దేశ ఎగుమతి వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా 4.7శాతం నమోదుచేసి ఏపీ ఎగుమతుల హబ్ గా అవతరించింది.
ఎమ్ఎస్ఎమ్ఈల స్వాలంబనకై నిలబడేందుకు తాజాగా ఏపీ ప్రారంభించిన కొత్త పారిశ్రామిక విధానం- 2020-23, ఎస్సీ, ఎస్టీల సాధికారతే ధ్యేయంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన “వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం” కొత్త పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. చెన్నయ్ –బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నోడ్ ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం మరో పారిశ్రామిక మలుపు. 2,139.44 కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి చేయబోయే ఈ నోడ్; భవిష్యత్ లో వలసలే లేకుండా, లక్ష మంది యువతకు ఉపాధి కల్పించే కల్పతరువు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో భాగంగా కడపలోని కొప్పర్తి కేంద్రంగా 6193 ఎకరాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలతో సిద్ధమయింది. తద్వారా రూ.25వేల కోట్ల పెట్టుబడులు, 2.5(రెండున్నర) లక్షల మందికి ఉద్యోగాలందించనుందీ.. రాయలసీమ పారిశ్రామిక మాగాణం.
పారిశ్రామికాభివృద్ధి కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలకు ప్రతి రూపం కడపలోని కొప్పర్తి కేంద్రంగా అభివృద్ధి చేయబోయే వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మానుఫాక్చరింగ్ క్లస్టర్. 540 ఎకరాల విస్తీర్ణంలో రూ.748 కోట్ల పెట్టుబడులతో వరంగా మారనుంది. వైఎస్ఆర్ ఈఎంసీ ఏర్పాటుతోనూ మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు, లక్షమందికి ఉద్యోగాలు అందించబోయే అక్షయపాత్ర.
కొత్తగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం; భోగాపురం, ఓర్వకల్,దగదర్తి వంటి కొత్త విమానాశ్రాయల అభివృద్ధి; కొంగొత్తగా 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, బుడగట్లపాలెం, పుడిమదాక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ లు పూర్తయితే మత్స్యకారుల జీవనోపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా మత్స్య ఆధారిత పరిశ్రమల వేగంగా అభివృద్ధి చేయాలన్నది సత్సంకల్పం.
దేశంలో 3 పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 63,606 ఎకరాల్లో విస్తరించబోయే విశాఖపట్నం- చెన్నయ్, చెన్నయ్-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు చెందిన 5 నోడ్ల అభివృద్ధి ద్వారా రూ.84,985 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 10 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నది .
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన శకటాల ప్రదర్శన.లో *పరిశ్రమల శాఖకు సంబంధించిన శకటం గురించి ఐటీ మంత్రి పి. ఆర్ .ఓ. దేవదాస్ రాసిన వ్యాఖ్యానం అందరిని అలరించింది.*
