నెగిటివ్ వార్తలు రాసిన,అనవసర వార్తలు రాసిన,వారు ఎదురుపడి, అవసరాల గురించి వచ్చి అడిగిన అంతే మర్యాదగా ప్రేమగా, పలకరించడం ఒక మేకపాటి గౌతం రెడ్డి కే సొంతం..

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మీడియా సోదరులకు, మిత్రులకు, సన్నిహితులకు నమస్కారం !!
నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐ.టీ, వాణిజ్యం, చేనేత, జౌళి,నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి దివంగత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డిగారి దగ్గర “పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్”గా విధులు నిర్వర్తించాను. గత మూడేళ్లుగా అత్యంత దగ్గరగా ఆయనని చూస్తూ, కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ భేదం లేకుండా పీఆర్వోగా అవకాశం ఇచ్చిన మంత్రిగారి కోసం పని చేయడానికి ప్రతి క్షణం ప్రయత్నించాను. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాను. ఈ క్రమంలో ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, నెల్లూరు జిల్లా మంత్రిగా, చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ జిల్లా మంత్రిగా, 5 శాఖల మంత్రి కవరేజీ కోసం మీడియాతో పని చేసే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. ఎనెన్నో అనుభూతులను పంచుకున్నాను. మరెన్నో తీపి గురుతులను మిగిల్చుకున్నాను.
మంత్రి మేకపాటి గారి మీద అభిమానం, ప్రేమను చాటుతూ దివంగత ప్రియతమ నాయకుడు మేకపాటి సంస్మరణ సభ నిర్వహిస్తోన్న ఆత్మకూరు నియోజకవర్గ మీడియా సోదరులకు ముందుగా మీకు ధన్యవాదాలు. శుభాభినందనలు. మీడియాలో ప్రజల సమస్యలపై ఎలాంటి వార్త వచ్చిన టక్కున స్పందించే ఐ.టీ మంత్రిగారి గురించి ప్రత్యేకంగా ఏమని చెప్పగలను? పరిశ్రమలు తీసుకుని వచ్చి మెట్ట ప్రాంత యువతీయువకులకు ఉద్యోగాలందించాలనేదే ఆశయంగా చివరి శ్వాస వరకూ పరిశ్రమించిన మంత్రి మేకపాటి గురించి ఎంతని చెప్పను? రాజకీయాలలోకి రావాలని ఆహ్వానించి, మంత్రిగా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి, 2 సార్లు ఆత్మకూరు శాసన సభ్యుడిగా అవకాశమిచ్చి గెలిపించిన వెన్నంటే నిలిచిన ఆత్మకూరు ప్రజలకు అత్యంత జవాబుదారీగా నిరంతరం కృషి చేసిన ఆయన శైలిని ఎలా వర్ణించగలను? మానవత్వం, మంచితనం, సున్నితమైన మనసు, ఎవరినీ నిందించని వ్యక్తిత్వం, తన పని తాను చేసుకుపోయే తత్వం మంత్రి మేకపాటిని తొణకని కుండలా, మచ్చలేని నిండు చంద్రుడిలా, సకల గుణాలున్న సుగుణాభి రాముడిగా రాజకీయాలలో ప్రత్యేకంగా నిలిపాయనడంలో అతిశయోక్తిలేదు.
మీకే కష్టమొచ్చినా వారి కుటుంబం ఎప్పుడూ అండగా నిలబడుతుంది. మీకే ఇబ్బంది ఎదురైనా ఆ కుటుంబం సమస్య పరిష్కారానికి ముందుండి పోరాడుతుంది. నెగిటివ్ వార్తలు రాసినా తప్పొప్పులు సమీక్షించుకోవడమే తప్ప పల్లెత్తు మాట అనని వ్యక్తి. అనవసర వార్తలు రాసిన వారు ఎదురుపడి అవసరాల గురించి వచ్చినా అంతే మర్యాదగా, ప్రేమగా పలకరించే తత్వం ఒక్క మంత్రికే సొంతం. ఎవరికైనా ఇబ్బంది కలిగితే టక్కున స్పందించేవారు. తప్పనిసరిగా చేయాలి సర్ అని అడిగితే సరేననేవారు. ఎంతటి చిక్కు ప్రశ్నకైనా చక్కని సమాధానం చెప్పేవారు. కావాలనే కక్ష కట్టి ప్రశ్నించినా ప్రశాంతంగా సమాధానం చెప్పిన ఆయన తీరు ప్రస్తుత తరంలోని ప్రతి నాయకుడికి ఆదర్శం. అనుసరణీయం.

మూడేళ్లలో మంత్రిగారితో ఏర్పడిన అనుబంధం గురించి వివరించాలంటే అక్షరాలు చాలవు. పుస్తకాలు సరిపోవు. మీ అందరి ప్రోత్సాహం, సహకారం ఎన్నటికీ మరువను. కుటుంబంలా చూసుకున్న మీ బంధాల్ని కడదాకా విడవను. మంత్రిగారితో ఉన్న తీపి గురుతులను కాసేపు కన్నీళ్లు కార్చి మర్చిపోలేను. మీతో ఏర్పడిన రుణానుబంధాన్ని చివరిదాకా వీడను. మంత్రిగారి మంచితనాన్ని ప్రపంచానికి చాటే పనిలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. మిమ్మల్ని తెలిసీతెలియక ఇబ్బంది పెట్టినట్లయితే మనసారా నన్ను మన్నించండి. మంత్రి మేకపాటి కుటుంబంపై ఇదే ప్రేమ, ఆప్యాయతలను భవిష్యత్ లోనూ అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేనున్నా, లేకున్నా మేకపాటి కుటుంబం వెంటే మీరంతా ఉండాలని, ఇలాగే ముందుకు నడపాలని ఆశిస్తున్నా.. ఉంటారని బలంగా నమ్ముతున్నా.
ఇట్లు
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఆర్వో

మంచిపగడం దేవదాస్.
Comments are closed.