The South9
The news is by your side.

ఒక్క క్యారెక్టర్ ఎన్ని పేర్లయ్యా బాబూ

post top

సుకుమార్‌, అల్లు అర్జున్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం.. పుష్ప. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇంతకుముందు వీళ్ల కలయికలో ‘ఆర్య’, ‘ఆర్య-2’ లాంటి క్రేజీ సినిమాలు రావడంతో ‘పుష్ప’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దగ్గర్నుంచి షూటింగ్ మొదలవడం వరకు అన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. అలాగే ఇందులో విలన్ పాత్ర విషయంలో ఏడాదిగా చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ ఎంతకీ ఆగట్లేదు. ఎప్పటికప్పుడు పేర్లు మారిపోతున్నాయి.. కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఏదీ ఖరారవ్వట్లేదు. ముందుగా విజయ్ సేతుపతిని ఆ పాత్ర కోసం అనుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. చాన్నాళ్ల పాటు ఆ పేరే ప్రచారంలో ఉంది.

after image

కానీ తనకు ఇచ్చిన పాత్ర ఎంతగానో నచ్చినప్పటికీ.. కరోనా వల్ల షెడ్యూళ్లన్నీ తారుమారై డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అరవింద్ స్వామి, బాబీ సింహా, నారా రోహిత్.. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకుందామా అని సుకుమార్ ఆలోచిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఎంతకీ ఆ పాత్ర ఎవరు ఖరారయ్యారన్నది తేలలేదు. ఇప్పుడేమో కొత్తగా మాధవన్ పేరు వినిపిస్తోంది ఆ పాత్రకు. ‘సవ్యసాచి’ సినిమా ఆడకపోయినా ఆ సినిమాలో విలన్ పాత్రతో మెప్పించి.. ‘నిశ్శబ్దం’లోనూ ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్న మాధవన్‌ను ‘పుష్ప’లో విలన్‌ పాత్రకు పరిశీలిస్తున్నారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. మరి ఇదెంత వరకు నిజమన్నది తెలియదు. అన్నీ కుదిరితే నవంబర్లో ‘పుష్ప’ చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
Tags: Allu Arjun Pushpa, Director Sukumar, puspa latest updates

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.