The South9
The news is by your side.
after image

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సారు… ఒక్కసారి మాకోసం రావాలి మీరు

post top

దివంగత ఆంధ్ర రాష్ట్ర ఐటి , భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబ సభ్యులే కాకుండా , ఆయనని అభిమానించే లక్షలాది అభిమానులతోపాటు, మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన వేలాది మంది ఇంకా ఆ బాధ లోనే ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి మూడేళ్లపాటు( పి .ఆర్ .వో) ప్రజా సంబంధాల అధికారి గా అద్భుతమైన పనితీరు కనపరిచి అధికారులు, జర్నలిస్టు మిత్రులతో మన్ననలను పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవదాస్ ఆయన తలంపులతో రాసిన అక్షరరూపం…..                                                                                                     

*దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సారు… ఒక్కసారి మాకోసం రావాలి మీరు.. ప్లీజ్ సర్ ?*.         

మీరు లేక మీ కాన్వాయ్ కళ మొత్తం పోయింది సర్. ప్రోటోకాల్ వెహికల్ లో సైరన్ మూగబోయింది సర్. మీరు ఎక్కక.. కోరి తెచ్చుకున్న కోట్ల రూపాయల ‘డిఫెండర్’ కారు ముందుకు కదలనంటే కదలనంటుంది సర్. ఆ కార్ లో మీరు ఉంచిన స్టైలిష్ కళ్ళద్దాలు బాధతో లుక్ తిప్పేసుకుంటున్నాయి సర్. రోజు వ్యాయామం చేసే డంబెల్స్, త్రెడ్ మిల్స్ వంటి సాధనాలు ఏ పనీలేక ఉండిపోయాయి సర్. మీరు వేసుకునే బూట్లు, సూట్ లు చలనం లేకుండా మిగిలిపోయాయి సర్. మీరు ఇష్టంగా తెప్పించ్చుకున్న “రసమలై” స్వీటు ఫ్రిజ్ లో అలాగే ఉండిపోయింది సర్. మీరు కనపడక మీ పెంపుడు జంతువులు షీరో, ఆర్లోలు మీరు కానరాక దిక్కుతోచక తోకూపుకుంటూ మీకోసం వెతుకుతున్నాయి సర్. దుబాయ్ నుంచి షాపింగ్ చేసిన బట్టల బాక్స్ అలా తెరవకుండానే ఉండిపోయింది సర్.

మీరు మంత్రిగా ఉన్న మూడేళ్ల కాలం మీతో వెన్నంటి ఉండిన వ్యక్తిగత సిబ్బంది ఏం చేయాలో తెలియక వాళ్ల తడారని కళ్ళు మీకోసం తడుముకుంటున్నాయి సర్. మీ ఆత్మకూరు, నెల్లూరు, వెలగపూడి సచివాలయం పేషీలన్నీ బోసిపోయాయి సర్. ఉద్యోగం కోసం, టిటిడి దర్శనం కోసం మీరిచ్చిన లెటర్లు చెల్లవు అంటున్నారు సర్. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే మీరు తరచూ తినే రాణిగారి తోట హోటల్ మీ రాక కోసం ఎదురు చూస్తోంది సర్. గచ్చిబౌలిలోని కేఎంసీలో ఉన్న ఆవు మీరే అరటిపండు తినిపించాలని మారాం చేస్తుంది సర్.

మీరు పుట్టిన బ్రాహ్మణపల్లిలోని గంగమ్మ తల్లి నా బిడ్డ ఏడని గుడి గంట ధ్వని రూపంలో ప్రశ్నిస్తోంది సర్. ఇటీవల వర్షాలకు శిథిలమైన సోమేశ్వర ఆలయం మీరుంటేనే పునరుజ్జీవం పోసుకుంటానంటుంది సర్. సోమశిల హై లెవెల్ కెనాల్ గట్టుదాకా వస్తూ ఆగిపోతూ కన్నీటిపర్యంతమవుతోంది సర్. సంగం ఆనకట్ట కట్టలు తెంచుకుంటానని విలపిస్తుంది సర్. నారంపేట పారిశ్రామిక పార్కు పురుడు పోసిన మీరే లేరని ఏడుస్తుంది సర్. ఐఏఎస్ లకు కూడా తెలియని అప్డేట్స్ ..ట్వీట్లతో నిత్యం ఎంతో సమాచారం ఇచ్చి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయినా ఎటువంటి టెక్నాలజీ వాడకుండా 42వేల ఫాలోవర్లను పొందిన మీ అకౌంట్ క్లోజ్ అయింది సర్.

Post Inner vinod found

ఆత్మకూరు బస్టాండ్ లో సందడి పోయింది. బట్టే పాడు పార్కు మధ్యలోనే ఆగింది.సంగం మండలం జ్యోతినగర్ లో మిమ్మల్ని నమ్ముకున్న నవదీప్ తండ్రి లాంటి మీరు లేరని తల్లడిల్లి గుక్క పట్టి ఏడుస్తున్నాడు సర్. ఆత్మకూరులో శారీరక ఎదుగుదల లేని మరుగుజ్జు పిల్లాడు కంఠంలో బాధని అదుముకుంటున్నాడు సర్. పేరంటం చేసిన మీ చేతుల మీదుగానే వివాహం చేసుకోవాలనుకున్న కానూరు చిన్నారి మీ వార్త విని విస్తుపోయింది సర్. ఆత్మకూరులో మీరు నిలబడి చాయ్ తాగిన టీ స్టాల్ యజమాని ఎందుకిలా జరిగిందని తనను తానే ప్రశ్నించుకుంటున్నారు సర్. మెట్ట ప్రాంతం అంతా భోరుమని కన్నీటి ప్రవాహాలను తలపిస్తుంది సర్.

సర్…..

Post midle

గౌతమ్ సర్.. మీరు ఒక్కసారి మా కోసం రావాలి సర్. అనాధలుగా మిగిలిపోయి లోలోపలే కుమిలిపోతున్న మాలాంటి వాళ్ళని “ఏమోయ్” అనీ ఒక్కసారి పలకరించాలి సర్. కలలోనైనా ఒకసారి కనిపించండి సర్. “ఆత్మ నాశనం లేనిది. ఒక శరీరాన్ని విడిచి మరో శరీరంలో చేరుతుందని భగవద్గీత చెప్పింది నిజమే అయితే”.. మీరు కచ్చితంగా మళ్ళీ మీ శరీరంలోనే ప్రవేశించి మా అందరి కోసం మళ్ళీ రావాలి సర్. ప్లీజ్ సర్. ప్లీజ్.?

*మంచిపగడం దేవదాస్*✍?

_*దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పీఆర్వో*

Post midle

Comments are closed.