The South9
The news is by your side.
after image

నేడు తొలి కార్తీక సోమవారం… శైవ క్షేత్రాలు కిటకిట!

శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమై, నేడు తొలి సోమవారం కావడంతో, శైవక్షేత్రాలతో పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు దేవాలయాల్లో కరోనా నిబంధనలను అనుసరించి, భక్తులకు దర్శనాలను కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. విశ్వేశ్వరుడు కొలువైన వారణాసి, మల్లికార్జునుడు కొలువుదీరిన శ్రీశైలం, శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన కాళహస్తి, రాజరాజేశ్వరుడు కొలువైన వేములవాడతో పాటు త్రిలింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది.

Post Inner vinod found

ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగానే ఉంది. ముందుగా అనుమతి తీసుకున్న భక్తులను, వీఐపీలనూ అనుమతిస్తుండగా, చిన్న దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదని తెలుస్తోంది. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. విజయవాడలో కృష్ణా ఘాట్, భవానీ ఘాట్, రాజమండ్రిలోని స్నానాల ఘాట్, శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని అలంపురం వద్ద కూడా అధికారులు భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారు.
Tags: Karthika Masam, Piligraims Monday, shiva temples

Post midle

Comments are closed.