నెల్లూరు : తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ నామినేషన్ కు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్ సరిగాలేదని జెడియు నేత , నెల్లూరు జిల్లా కలెక్టర్,
తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబుకి ఫిర్యాదు చేశారు. రత్నప్రభ సమర్పించిన అఫిడవిట్ లో బంజారా హిల్స్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లు తో పాటు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్లో రత్నప్రభ పై కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని జనతాదళ్( యు) నేత వీర రమణ రిటర్నింగ్ అధికారికి ఈ ఫిర్యాదు లో తెలియజేశారు. ఈ కేసులన్నీ ఉండగా తనపై ఎటువంటి కేసులు లేవని అఫిడవిట్లో పొందుపరిచారు అని ఆర్ వో కి ఇచ్చిన వినతి పత్రం లో తెలిపారు. అలానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మెన్ గా పనిచేస్తూ అక్కడి ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతుందని , అయితే పెన్షన్ తో జీవిస్తున్నట్టు అఫిడవిట్ లో పొందుపరిచారు అని అన్నారు. అదేవిధంగా రత్నప్రభ కుల ధ్రువీకరణ పత్రం కూడా సరైనది కాదని రమణ అన్నారు. అయితే ఇప్పటికే నామినేషన్ల కార్యక్రమం పూర్తవడం స్క్రూటినీ లో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం జరిగింది. నాలుగు నామినేషన్లు సాంకేతిక లోపాలు వలన తిరస్కరణకు గురి అయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రత్నప్రభ పై చేసిన ఆరోపణల ను ఎన్నికల సంఘం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారో అనేది తెలియాల్సి వుంది.
Comments are closed.