- ఉపాధి అవకాశాలే లక్ష్యంగా త్వరలో ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్’ ఏర్పాటు
- ఓంక్యాప్’ ద్వారా త్వరలో 3వేల విదేశీ ఉద్యోగాల భర్తీ
- గత బోర్డు మీటింగ్ లో నిర్ణయాల కార్యాచరణపై మంత్రి మేకపాటి సంతృప్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతీ, యువకులు అవలీలగా విదేశాల్లో ఉద్యోగాలు పొందే వీలుగా త్వరలో ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఓంక్యాప్ ద్వారా జర్మనీ, గల్ఫ్, యూరప్ దేశాల్లో 3 వేల మందికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) కార్యాలయంలో జరిగిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) 23వ బోర్డు మీటింగ్ లో ఆన్ లైన్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చైర్మన్ హోదాలో పాల్గొని నైపుణ్యశాఖ ఉన్నతాధికారులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. గత బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు పరచిన తీరు, కార్యాచరణపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
బోర్డు మీటింగ్ లో చర్చించిన విషయాలు మరియు తీసుకున్న నిర్ణయాలు:
* ఈ బోర్డు మీటింగ్ లో 22వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై చర్చించారు. 2019-2020లో ఓంక్యాప్ ద్వారా సుమారు 2వేల మంది యువతను విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు పంపినట్టు తెలిపారు.
* కోవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి ఆశించినంతగా శిక్షణా కార్యక్రమాలను అమలు జరగలేదని.. ఓంక్యాప్ దగ్గర ఇప్పుడు దాదాపు 2వేల ఖాళీలు వివిధ దేశాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంటిపని వారు, వంటపని, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్గు, నర్సులు, ఫోర్క్ లిఫ్ట ఆపరేటర్లు, మొదలైన ఉద్యోగాలు ఉణ్నాయి. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన శిక్షణ, ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు పరిస్థితులు మెరుగైన తర్వాత ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమావేశంలో ఓంక్యాప్ ఎండి, డాక్టర్ అర్జా శ్రీకాంత్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
* ఇవి కాకుండా జర్మనీ దేశం నుంచి వెయ్యి మంది నర్సుల భర్తీకి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి మెడిజిన్ పార్క్, రీన్-రుహ్ ఎజి కంపెనీ (Medizin Park, Rhein-Ruhr AG Company) కంపెనీతో అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచే జర్మనీలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జర్మన్ భాషతోపాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోడం జరుగుతుంది.
* కోవిడ్ కారణంగా విదేశాలకు వెళ్లలేకపోయిన వారి కోసం స్థానిక ఉద్యోగ ఆసరా (లోకల్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్) పేరుతో (మొబైల్ యాప్ ద్వారా) ప్రత్యేక కార్యక్రమాన్ని ఓంక్యాప్, ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రారంభించాయి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది.
అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) ద్వారా మొదలు పెట్టిన ఇండియన్ ఇంటర్నేషనల్ స్కిల్స్ సెంటర్ (ఐ.ఐ.ఎస్.సి) ప్రణాళికలోనూ ఓంక్యాప్ భాగస్వామ్యం అయింది. ఈ పథకంలో భాగంగా ఎన్.ఎస్.డి.సి వివిధ దేశాల్లో ప్రస్తుతం, భవిష్యత్తులో ఉండబోయే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఓంక్యాప్ కు ఇస్తారు. అందుకు అనుగుణంగా అవసరమైన శిక్షణను 4 ప్రభుత్వ ఐటిఐలు (తిరుపతి, విజయవాడ, కాకినాడ, వైజాగ్) 2 న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) సెంటర్లు (రాజమండ్రి, పులివెందుల) తోపాటు 2 ప్రైవేట్ సెంటర్లలో ఓంక్యాప్ ద్వారా భాషా మరియు ఇతర శిక్షణలు ఇస్తారు.
ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్-ఎపి (ఐఎంసి):
మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు సరైన సమాచారం ఇవ్వడానికి ఎపిఎస్‌ఎస్‌డిసి, ఎపిఎన్ఆర్టీ, ఓంక్యాప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్-ఎపి (ఐఎంసి) ని నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది. ఐఎంసి-ఎపి కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ ఆఫీసులు, ఐటిఐ, జిల్లా నైపుణ్యకేంద్రాలలో త్వరలో ప్రారంభిస్తారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడంతోపాటు కెరీర్ కౌన్సిలింగ్, గైడెన్స్ తోపాటు ప్రిడిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ (విదేశాలకు వెళ్లే ముందు ఇచ్చే శిక్షణ) ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రితోపాటు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ బోర్డు మీటింగ్ కు మంత్రి మేకపాటి గౌత్ రెడ్డితోపాటు నైపుణ్యాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము ఆన్ లైన్ ద్వారా హాజరుకాగా ఓంక్యాప్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఓంక్యాప్ జనరల్ మేనేజర్ డాక్టర్ కె.వి. స్వామి, కంపెనీ సెక్రెటరీ పవన్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
Comments are closed.