
చెన్నై: ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు సాహిత్యమంటే మక్కువ. అదే ఆయనను గీత రచయితను చేసింది. తన 11వ ఏటే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. అలా విద్యార్థి దశలో ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రచించారు. అయితే, మనసంతా నాటకాల మీద, సినిమాల మీదే ఉండటంతో అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ను సినీ గేయ రచయితగా నిలబెట్టింది.

తొలి అవకాశం అలా వచ్చింది!
నెల్లూరుకు చెన్నై దగ్గరే కావడంతో వెన్నెలకంటి సరదాగా అక్కడక వెళ్లి వస్తుండేవారు. అలా 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’’ పాట రాసే అవకాశమిచ్చారు. అదే ఆయన తొలి సినీగీతం. 1987లో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నా చెల్లెలు’ సినిమాకి ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ పాట రాశారు. అలా వెన్నెలకంటి ప్రయాణం నెమ్మదిగా ఊపందుకుంది. దీంతో ఎస్‌బీఐలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యోగం మానేసి సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం కొనసాగించారు.
Comments are closed.