
మేయర్ ఎన్నిక: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్న టీఆర్‌ఎస్
వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్
మధ్యలోనే వెళ్లిపోయిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి.
టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన ఎంఐఎం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది అందరూ ఊహించినట్టు తెరాస మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరికి కారు పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులనే వరించింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు : మేయర్ పీఠం కోసం తొలినుంచి అధికార టీఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్)తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, పీజేఆర కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పేరును ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించారు. మేయర్ పీఠం కోసం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జైశ్రీరాం అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు.
పీజేఆర్ విజయారెడ్డి నిరాశ : ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. హాల్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు ఆమె వ్యవహార శైలిని గమనించారు. కాగా పార్టీ శ్రేణులు విజయారెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా ఆమె అంతే.. వదిలేసేయండి అంటూ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మీడియా దృష్టిలో పడటానికి విజయా రెడ్డి ఇలా చేశారనే వాదన వినిపిస్తుంది. కాగా గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతో టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేజిక్కించుకుంది.
Comments are closed.