- లాక్ డౌన్ వల్ల ఊపందుకున్న ఓటీటీ
- ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ విడుదల
- ‘రెడ్’ చిత్రానికి ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు
- థియేటర్లోనే రిలీజ్ చేయమంటున్న రామ్
లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఊపందుకుంది. థియేటర్లన్నీ మూతబడడంతో చాలామంది నిర్మాతల చూపు ఓటీటీ ప్లేయర్స్ మీద పడింది. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తుండడంతో, కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఈ ఆన్ లైన్ కంపెనీలకు విడుదల కోసం ఇచ్చేస్తున్నారు. నాని నటించిన ‘వి’ చిత్రం కూడా అలాగే ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదలైంది. సినిమాలో పెద్దగా విషయం లేదని వార్తలొస్తున్నాయి. అయినప్పటికీ, ఇలా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయడం వల్ల నిర్మాతకు భారీగా లాభం వచ్చిందని అంటున్నారు.
అయితే, నిర్మాతలు ఇలా విడుదల చేసుకుని, బయటపడదామని ఆలోచిస్తున్నప్పటికీ బాగా ఇమేజ్ వున్న కొందరు హీరోలు మాత్రం ఈ ఓటీటీ విడుదల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. థియేటర్లలో అయితేనే తమ అభిమానులు చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనీ, తమ ఇమేజ్ మరింతగా పెరుగుతుందనీ స్టార్ హీరోలు ఇలాంటి విడుదలకు అభ్యంతరం చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో హీరో రామ్ నటించిన ‘రెడ్’ చిత్రానికి కూడా ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. అయితే, కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని రామ్ పట్టుపడుతుండడంతో నిర్మాత ఆ ఆఫర్లను తిరస్కరించినట్టు చెబుతున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఎలాగూ థియేటర్లు తెరుస్తారనీ, అంతవరకూ ఓపిక పట్టమనీ రామ్ చెప్పాడట. సంక్రాంతికి డైరెక్టుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని రామ్ నిర్మాతకు సూచించాడని తెలుస్తోంది.
Tags: Ram Kishor , Tirumala, Red OTT
Comments are closed.