అమరావతి, అక్టోబర్, 21; ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తేవడానికి పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ‘ఇండస్ట్రీస్ స్పందన’ అనే పోర్టల్ ద్వారా ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దొరికే దిశగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు నవంబర్ లో శ్రీకారం చుట్టే దిశగా అడుగు ముందుకువేయాలని పరిశ్రమల శాఖ అధికారులను మంత్రి మేకపాటి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో పరిశ్రమలశాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వారానికి ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్న ‘స్పందన’ కార్యక్రమంలాగే నెలకు ఒకసారి పరిశ్రమల శాఖపైనా సమీక్షించేలా ఈ ఆన్ లైన్ ‘ఇండస్ట్రీస్ స్పందన’ పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తే ప్రజలతో పాటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు మరింత దగ్గరవుతామన్నారు. నిరంతర పర్యవేక్షణ, అప్రమత్తత, వేగంతో పాటు మరింత జవాబుదారీ, పారదర్శకత తీసుకురావలన్నదే ధ్యేయమన్నారు మంత్రి మేకపాటి. పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహమున్నా వెంటనే స్పందన ద్వారా నివృత్తి అవుతుందని, ఏ విషయమైనా సత్వరమే పరిష్కారంతో పాటు స్పష్టతలో వేగం ఖాయమని మంత్రి తెలిపారు. ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం తదితర పరిణామాలపై గ్రీవెన్స్ పూర్తయ్యాక ఫిర్యాదుదారుడి సంతృప్తిపై ‘ఫీడ్ బ్యాక్’ తెలుసుకునే వెసులుబాటుకూ చోటు కల్పించాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వైఎస్ ఆర్ ఏపీ వన్ లను కూడా చేర్చాలని మంత్రి సూచించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ వర్చువల్ ఎంట్రిప్రూనర్ డిజిటల్ అసిస్టెన్స్ గా ఆన్ లైన్ పోర్టల్ ఉపయోగపడనుందన్నారు.
ఫిర్యాదు లేదా సమస్యను ఏ సెక్టార్ లో, ఏ సమస్య, ఏ విభాగం పరిధిలోనిది తదితర వివరాలతో సహా సబ్ మిట్ మీట నొక్కిన వెంటనే ఫిర్యాదుదారుడికి మెసేజ్ వచ్చే సౌలభ్యం కూడా పోర్టల్ లో ఇనుమడింపజేసినట్లు మంత్రి మేకపాటికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది సూచించారు. పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా ఎపుడైనా ‘గ్రీవెన్స్’ తెలిపేలా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ అంశాలపైనా మంత్రి చర్చించారు.
బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి : మంత్రి మేకపాటి:

చిన్నారులు ఆడుకునే ఆకర్షణీయ బొమ్మలు, ఆట వస్తవులకు సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టాయ్స్ ఇండస్ట్రీకి ప్రాధానిస్తూ ‘ఏపీ బొమ్మల తయారీ బోర్డు’ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీని ఆదేశించారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. మంత్రి దృష్టికి వస్తున్న ప్రతిపాదనలకు అనుగుణంగా కడపలోని కొప్పర్తి దగ్గర ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి మేకపాటి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యాదవపురం అనే ప్రాంతంలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుకు అడుగు ముందడుగు పడిందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది మంత్రి మేకపాటికి వివరించారు. ఈ సందర్భంగా సోమశిల కాలువ ద్వారా చిత్తూరు – నెల్లూరు కేంద్రంగా పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలపై దృష్టి పెట్టాలని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ తయారు దిశగా సమాలోచన చేయాలని పేర్కొన్నారు. ఏపీ టెక్స్ట్ టైల్స్, గార్మెంట్స్ పాలసీ 2018-23 ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఐఎస్ బీతో భాగస్వామ్యం తదితర అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఐఎస్ బీ ఆధ్వర్యంలో ఏర్పాటవనున్న ‘పాలసీ ల్యాబ్’ ప్రస్తుత పరిస్థితిపైనా చర్చించారు. పరిశ్రమల శాఖపై మంత్రి సమీక్షకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మేకపాటితో ఐ.టీ శాఖ సలహాదారుల భేటీ:

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో ఐ.టీ శాఖ సలహాదారులు సమావేశమయ్యారు. ‘డేటా సెంటర్ మోడల్’ గురించి హెవెలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. మల్టీ లెవల్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ ఏర్పాటు, పనితీరు వంటి కీలక విషయాలు ఎలా ఉండాలన్న దానిపై మంత్రి ఆరా తీశారు. అనంతరం పలు సూచనలిచ్చారు. ఈ భేటీకి ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి హాజరయ్యారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో బాడి బిల్డర్ రవి కుమార్ కు కార్పొరేట్ సంస్థల ‘సీఎస్ఆర్’ నిధుల ద్వారా సహకారం : మంత్రి మేకపాటి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిశ్శంకరరావు రవికుమార్ అనే బాడీ బిల్డర్ కు ప్రభుత్వం తరపున అండగా నిలిచే బాధ్యత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీసుకున్నారు. మంగళవారం గుంటూరుకు చెందిన బాడీ బిల్డర్ రవికుమార్ ముఖ్యమంత్రిని కలిశారు. శరీర ధృడత్వ పోటీలలో పాల్గొనేందుకు ఆర్థికంగా సాయమందించాలని సీఎంను కోరగా .. సీఎం జగన్, ఆ బాధ్యతను మంత్రి మేకపాటికి అప్పగించారు. రవికుమార్ బుధవారం మంత్రి ఛాంబర్ లో మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. 2019లో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలలో స్వర్ణ పతకం సాధించినట్లు రవికుమార్ మంత్రికి తెలిపారు. 21 ఏళ్ళ వయసులోనే 45 ఏళ్ల కిందట జనార్ధన్ అనే బాడీబిల్డర్ రికార్డును అందుకోవడాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నట్లు రవికుమార్ మంత్రికి వివరించారు. 2015 నుంచి ఇలాంటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పురస్కారాలు అందుకున్న రవికుమార్..తాజాగా 2018లో పుణెలో జరిగిన అంతర్జాతీయ స్థాయి (75కేజీలు) ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించినట్లు వెల్లడించారు. అయితే పరిశ్రమల శాఖ ద్వారా పలు సంస్థలను సంప్రదించి రవికుమార్ కు అవసరమైన బ్రాండింగ్ తో పాటు ఆర్థిక సహకారమందించే దిశగా చూడాలని మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

Comments are closed.