The South9
The news is by your side.
after image

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన జనసేన, బీజేపీ బృందం

post top

గవర్నర్ స్వయంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలి
* రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన జనసేన, బీజేపీ బృందం
* రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వినతిపత్రం సమర్పణ
* పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై చర్చ
* ఏకగ్రీవాలపై మంత్రులు, ప్రభుత్వ పెద్దల ప్రకటనలపై ఫిర్యాదు
నివర్ తుపాను బాధిత రైతుల సమస్యలు, ఆలయాలపై వరుస దాడుల అంశం ప్రస్తావన
రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను గవర్నర్ స్వయంగా పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయమని జనసేన, బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి విజ్ఞప్తి చేసినట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియచేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై, పంచాయతీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. గురువారం ఉదయం జనసేన, బీజేపీ బృందం రాష్ట్ర గవర్నర్ ను కలిసింది. జనసేన పక్షాన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ , బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ,పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ మధుకర్ రాష్ట్ర గవర్నర్ ని కలిసి పరిస్థితులను వివరించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ..”రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. గతంలో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ ని కోరాం. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సహకాలు ఇవ్వడం సహజమే. దాన్ని మేము ఆహ్వానిస్తాం. అయితే ప్రభుత్వం ప్రలోభపెట్టి, భయపెట్టి ఏకగ్రీవాలు చేసే విధంగా కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. ఇటీవల మంత్రులు, ప్రభుత్వ పెద్దలు జారీ చేసిన ప్రకటనలు, ఇచ్చిన స్టేట్ మెంట్లను గవర్నర్ వద్ద ప్రస్తావించాం. అందుకు సంబంధించిన కాపీలు కూడా అందచేశాం. ఆన్ లైన్ లో నామినేషన్ స్వీకరించే ప్రక్రియ తీసుకురావాలన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం. భారతీయ జనతా పార్టీ, జనసేన కలసి ఈ ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. ఈసారి యువత ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల ప్రక్రియను ఓ పండుగలా ముందుకు తీసుకువెళ్లాలి. ప్రభుత్వ దౌర్జన్యాలకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అహంకారంతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోరిన విధంగా యువతను పెద్ద ఎత్తున బరిలోకి దింపే విధంగా చర్యలు తీసుకుంటాం.
* వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని..
కుల ధ్రువీకరణ పత్రాలు, బకాయిలకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విదమైన కుట్రలను ప్రతి ఒక్కరు ఖండించాలి. అధికార యంత్రాంగం, ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు ఎన్నికల కమిషన్ కి సహకరించాలి.

 

Post Inner vinod found

గవర్నర్ దృష్టికి ఛలో అసెంబ్లీ అంశం
నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి సరైన రీతిలో పరిహారం అందలేదన్న విషయాన్ని కూడా గవర్నర్ కి వివరించాం. పెట్టుబడి కూడా దక్కకపోగా అప్పుల పాలైన రైతులని ఆదుకోవాలని సహేతుకమైన పరిహారం కోసం డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన విషయాన్ని పవన్ కల్యాణ్ గవర్నర్ కి తెలియచేయమన్నారు. ఆ వివరాలను సవివరంగా గవర్నర్ ముందు ఉంచాం” అన్నారు.
ఆలయాలపై దాడుల వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ప్రభుత్వం అనేక ఘర్షణలను ప్రోత్పహించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా మంది ఆసుపత్రి పాలయిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ దౌర్జన్యాలకు చాలామంది గాయాల పాలయ్యారు. వైసీపీ కార్యకర్తలు బిజీపీ, జనసేన కార్యకర్తలను అనేక చోట్ల ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో జెడ్పీటీసీలు ఏకగ్రీవం అవడం చూశాం. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో గవర్నర్ ని కలిసి పరిస్థితులను వివరించాం. నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి గతంలో జరిగిన అంశాల ఆధారంగా ప్రభుత్వం సజావుగా వ్యవహరించే విధంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరడం జరిగింది.
ఆలయాల‌పై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోంది. ముందుగా సి.బి.సి.ఐ.డి. వేయడం తర్వాత సిట్ వేయడం.. ఇప్పటి వరకు సిట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చూస్తున్నాం. విచారణ వేగవంతంగా చేయడం లేదు. జాతీయత ఆధారంగా, హిందూత్వం ఆధారంగా ముందుకు వెళ్తున్న బీజేపీ, మిత్రపక్షం కార్యకర్తల్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బాల్లో ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా కాదని వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. ఆలయాలపై జరుగుతున్న దాడుల వ్వవహారంలో బీజేపీ పాత్ర ఉందని చెప్పడం నీతిబాహ్యమైన చర్య. అధికార పార్టీయే మతతత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజా ధనంతో చర్చిలు కడుతున్నారు. చర్చి ఫాదర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు. మతమార్పిడిలు ప్రోత్సహించమనా? దీనిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి” అన్నారు.

Post midle

Comments are closed.