The South9
The news is by your side.
after image

తెలంగాణ లో పుట్టిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మాయం కానుందా?

post top

తెలంగాణ లో పుట్టిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మాయం కానుందా? అగ్రనేతలు నిష్క్రమించగా.. మిగిలిన నాయకులు, కార్యకర్తలను కూడా కాపాడుకునే సత్తా పార్టీ అధినేత చంద్రబాబులో పోయిందా? అధ్యక్షుడు రమణను మార్చాలని ఏళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండును పట్టించుకోని, బాబు సాగతీత- నాన్చుడు ధోరణే అసలు సమస్యనా? రమణను తొలగించకపోతే, తెలంగాణ తమ్ముళ్లు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారా? ఆఫీసులోని అన్న విగ్రహం వద్దనే ధర్నాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.. తాజాగా జరుగుతున్న పరిణామాలు దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి. తత్వం బోధపడినా అనుభవం కాని చంద్రబాబు నాన్చుడు వైఖరి, ఇప్పటికే తెలంగాణలో టీడీపీ కొంప ముంచగా.. అది మరింత ముదురిన ఫలితంగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో కొంపకొల్లేరయ్యే ప్రమాదం తలెత్తింది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అసమర్థ నాయకత్వానికి, దన్నుగా నిలిచిన చంద్రబాబు అందుకు త్వరలో మూల్యం చెల్లించుకోనున్నారు. రమణను మార్చాలని తెలంగాణ తమ్ముళ్లు ఎన్నిసార్లు కోరినా బాబు, ‘చూద్దాం.. మాహాడతాం’ అనే పడికట్టు పదాలు తప్ప, అంతర్గత సమస్యపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఇప్పటివరకూ రమణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ పార్టీ బతికి బట్టకట్టింది లేదు. రమణ నియంతృత్వ వైఖరి వల్లే.. గతంలో గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిందన్న విమర్శలున్నాయి. రమణ ఒంటెత్తు పోకడల వల్ల.. అప్పట్లో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావు సహా, సీనియర్లంతా పార్టీని వీడారన్న ఆరోపణలూ లేకపోలేదు. గత గ్రేటర్ ఎన్నికలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల టికెట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా మూటకట్టుకున్నారు.

Post Inner vinod found

ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్నా..
రమణను మార్చకపోవడం చంద్రబాబు లోపమేనని, ఆయన నిరాసక్తత- సాగతీతే పార్టీకి అసలు సమస్య అని సీనియర్లు కుండబద్దలు కొడుతున్నారు. రమణను ఎందుకు కొనసాగిస్తున్నారో, ఆయనపై బాబుకు ఎందుకంత అభిమానమో అర్ధం కావడం లేదంటున్నారు. కాగా, ఈనెల 27న టీడీపీ ఏపీ-తెలంగాణ-జాతీయ కమిటీలు ప్రకటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి ముందే, తెలంగాణ రాష్ట్ర -జిల్లా నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. రమణను మార్చాలని రాష్ట్ర కమిటీలో ముగ్గురు మినహా, మిగిలిన నేతలంతా బాబుకు లేఖాస్త్రం సంధించడం సంచలనం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులోనే భేటీ అయిన, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు.. రమణను మార్చాలని, ఆయన తమకు పోటీగా జిల్లాల్లో నేతలను ప్రోత్సహిస్తున్నారని, కోర్ కమిటీలో అనామకులకు స్థానం కల్పిస్తున్నారని బాబుకు లేఖ రాయాలని నిర్ణయించారు. తెలగుమహిళా అధ్యక్షురాలు జోత్స్నను కోర్ కమిటీ మీటింగుకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. అయితే, ఆ సమావేశం వివరాలు తెలుసుకున్న రమణ, హటాత్తుగా అక్కడికి వెళ్లారట. నా అనుమతి లేకుండా ఇక్కడ మీటింగు ఎలా పెడతారని గుడ్లు ఉరిమారట. ఇష్టం ఉన్న వాళ్లు ఉండండి. లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోండని గద్దించారట. ఆ తర్వాత మరోమారు భేటీ అయిన తమ్ముళ్లు, రమణను మార్చకపోతే పార్టీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.

బాబుకు ఆరకంగా లేఖాస్త్రం సంధించిన వారిలో, 14 మంది జిల్లా పార్టీ అధ్యక్షులున్నట్లు సమాచారం. కాగా పార్టీ ఆఫీసులో ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. కాగా త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. సీపీఐ-సీపీఎం సహా ఇతర పార్టీలతో పొత్తు కోసం, రమణ చేస్తున్న ప్రయత్నాలపై హైదరాబాద్ నేతలు విరుచుకుపడతున్నారు. గతంలో కూడా రమణ అసమర్ధ నాయకత్వం వల్లనే హైదరాబాద్‌లో పార్టీ ఓడిందని, ఇప్పుడు మళ్లీ పొత్తుల పేరుతో ఆయన పార్టీని ముంచే ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అసలు హైదరాబాద్ పార్టీ వ్యవహారాల్లో, రమణ జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించకుండా.. అది విపత్తుగా మారేంతవరకూ, నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు వైఫల్యమే, ఈ దుస్థితికి కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘రమణ స్థానంలో సారు దగ్గర ఉండే మాణిక్యాన్ని పెట్టినా బాగా నడుపుతారన్న’ వ్యంగ్యోక్తులు, పార్టీ ఆఫీసులో బహిరంగంగానే వినిపిస్తుంటాయి. పార్టీ నేతలకే తెలిసిన ఈ సత్యం, ఇప్పటిదాకా బాబుకు తెలియకపోవడమే ఆశ్చర్యమంటున్నారు. పార్టీ అధినేతగా బాబు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారని, అందుకే అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారని ఓ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు భయపడి, తెంగాణలో పార్టీని విడిచిపెట్టారన్న చర్చకు, బాబు ఇప్పటివరకూ తన పనితీరు ద్వారా తె రదించలేకపోయారు. అయినప్పటికీ, ఉన్నంతలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా.. బాబు చేస్తున్న జాగుకు విసిగి, పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేదు అనుభవాలెదురవుతున్నా, బాబు ఇంకా అదే నాన్చుడు ప్రపంచంలో జీవించడం ఏమిటో?.

Credit: Lavanya kavoori _ UK

Post midle

Comments are closed.