*అదానీ చేతికి గంగవరం పోర్టు?*
వార్బర్గ్ పింకస్ నుంచి 31.5% వాటా కొనుగోలుకు ఒప్పందం
లావాదేవీ విలువ రూ.1,954 కోట్లు
*డీవీఎస్ రాజు వాటా కొనుగోలుకూ సంప్రదింపులు*
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుంది. ఈ పోర్టు కంపెనీలో 31.5% వాటాను రూ.1,954 కోట్లకు వార్బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గంగవరం పోర్ట్ కంపెనీలో 16.3 కోట్ల షేర్లు అదానీ సంస్థ చేతికి రానున్నాయి. ఒక్కో షేరును రూ.120 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది.
విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్-మేజర్ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టులో ఉంది.
బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్ కేప్ సైజ్ ఓడలూ ఈ పోర్టుకు వచ్చిపోగలవు. 1800 ఎకరాల్లో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. ఈ పోర్టు నుంచి బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం, తదితరాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది. ఈ పోర్టు సామర్థ్యాన్ని 31 బెర్తులతో, ఏటా 25 కోట్ల టన్నుల సరకు రవాణా చేయగలిగేలా విస్తరించటానికి మాస్టర్‌ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది.
* 2019-20లో ఈ పోర్టు ద్వారా 3.45 కోట్ల టన్నుల సరకు రవాణా నమోదైంది. తద్వారా రూ.1,082 కోట్ల ఆదాయాన్ని గంగవరం పోర్ట్ కంపెనీ నమోదు చేసింది. వడ్డీ, పన్నులు, రుణవిమోచనకు ముందు ఆదాయం (ఎబిటా) రూ.634 కోట్లు ఉంది. నికరలాభం రూ.516 కోట్లు. కంపెనీకి అప్పు లేకపోగా, రూ.500 కోట్లకు పైగా నగదు నిల్వ ఉండటం ప్రత్యేకత.
కృష్ణపట్నంతో పాటు: రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టును కొంతకాలం క్రితం అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గంగవరం పోర్టునూ దక్కించుకోవటంతో దేశానికి తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో అదానీ పోర్ట్స్ క్రియాశీల సంస్థగా ఆవిర్భవించనుంది. దేశవ్యాప్తంగా 12 ప్రదేశాల్లో అదానీ పోర్ట్స్‌కు నౌకాశ్రయాలు ఉన్నట్లు, తద్వారా ఈ విభాగంలో ఈ సంస్థ మార్కెట్ వాటా 30 శాతానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము అభివృద్ధి చేయాలనుకుంటున్న కార్గో టెర్మినల్స్‌కు గంగవరం పోర్టు ఎంతో అనుకూలమని అదానీ పోర్ట్స్ సీఈఓ కరణ్ అదానీ వివరించారు.
వాటాలు ఇలా: గంగవరం పోర్టు కంపెనీ జారీ మూలధనం 51.70 కోట్ల షేర్లు. ఇందులో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1% వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.4%, వార్బర్గ్ పింకస్ చేతిలో 31.5% వాటా ఉంది. వార్బర్గ్ పింకస్ వాటానే అదానీ గ్రూపు ఇప్పుడు కొనుగోలు చేస్తోంది. డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న వాటా కొనుగోలుకు ఆయనతో మాట్లాడుతున్నట్లు అదానీగ్రూపు తెలిపింది.
