The South9
The news is by your side.
after image

ధిక్కార స్వరం… జాషువా.

post top

*ధిక్కార స్వరం… జాషువా -*

((సెప్టెంబర్ 28న జయంతి సందర్భంగా…)

 

“రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు” అంటూ ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిన కవి గుర్రం జాషువ, జాషువా జీవితానికి ప్రతిబింబించే కావ్యం ఇది. 19 వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం భావకవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి మూఢాచారాలతో తులతూగుతున్న ఆనాటి పెత్తందార్ల అధర్మాలకు అడ్డుకట్టగా నూతన ఒరవడి సృష్టించారు. తన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన కవి సామ్రాట్ 1895 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం లోని చాట్రగడ్డపాడు గ్రామంలో వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులది కులాంతర వివాహం కావడంతో బాల్యంలోనే చదువుకోవడానికి అనేక చీత్కారాలు సమాజం నుంచి ఎదుర్కొన్నారు.

గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర వంటి ఎన్నో ఖండకావ్యాలు జాషువ కాలంలో పురుడు పోసుకున్నాయి. పర్షియన్ చక్రవర్తి గజిని మహ్మద్ ఆస్థానంలో కవి ఫిరదౌసి, అతని రాజు మాటకొక బహుమానం ఇస్తానని చెప్పగా, కవి పదేళ్లు శ్రమించి మహాకావ్యం రాస్తాడు. కానీ రాజు ఇచ్చిన మాటను తప్పడంతో ఆవేదన చెందిన ఆ కవి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కవి హృదయాన్ని జాషువా స్వయంగా అనుభవించినట్లు రాశారు. కవి తనలోని ఆవేదనలు సమాజానికి తెలియపరచడమే జాషువా రచనల సారాంశంగా ఉంటాయనడానికి ఫిరదౌసి నిదర్శనం. సమాజంలోని హెచ్చు తగ్గులపై తన కవిత్వాన్ని ఎక్కుపెట్టిన కవి జాషువ. కాళిదాసు మేఘసందేశం తరహాలో ‘గబ్బిలం’ కావ్యం రాసిన నవయుగ చక్రవర్తి. అందులో ఒక అంట రాని కులానికి చెందిన కథానాయకుడు (గబ్బిలం) తన గోడును సమాజానికి వినిపించడమే కథాంశం. “నాదు కన్నీటి కథ సమన్వయము సేయనార్ధ హృదయంబు గూడ కొంతవసరంబు” అని గబ్బిలం గురించి జాషువా

వాపోయాడు. దళితులకు తిండి, బట్టలతో పాటు స్వేచ్ఛా జీవనం కూడా. దుర్భేద్యంగా ఉండేది. ఆనాటి కాలంలో అగ్రకులాధికారాని వ్యతిరేకంగా గొడ్డలి పెట్టు లాంటి రచనలు చేశారు జాషువ. “కఠిన చిత్తుల దురాగములు ఖండించి కనికర మొలకించు కులమునాది” అందుకే “నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని” అని హెచ్చరించాడు. గర్జించాడు. శాసించాడు. చతుర్వర్ణ వ్యవస్థను నిలదీస్తూ జాషువా విప్లవ మూర్తిగా సాక్షాత్కరించాడు.

పంచమ కులం ఎక్కడుందని ఆవేదనకు గురయ్యాడు. “ముసలి వాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారుల నుట విన్నాను గాని వసరమునకన్న హీనుడు భాగ్యుడు.. యైదవ కులస్థుడెవరమ్మా, సవిత్రి అంటూ తన పద్యాలను తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహి త్యానికి మార్గదర్శకం చేశారు. అయితే కులం ద్వారా కలిగిన అవమానం, దాంతో జాషువా హృదయం ద్రవిం చింది. “ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి యినుప గజ్జెల తల్లి జీవనము సేయు గసరి బుసగొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు” అని హిందుత్వాన్ని అంతే తీవ్ర స్వరంతో నిరసించాడు. “విశ్వ నరుడను నేను నాకు తిరుగులేదు” అని తన వీర కవిత్వాన్ని యావత్

Post Inner vinod found

ప్రపంచానికి ఒక చక్కని అక్షర పూలమాలలుగా అందించారు. జాషువా కష్టజీవి గురించి “వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు వానికి భుక్తి లేదు” ఇంకా “చిక్కిన కాసుచే దనివి జెందు సమాయకుడెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్టిక్కులు గల్గు లోకమున ధిక్కరి యున్న యరుంధతీ సుతుందొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం కడగొట్టు బిడ్డడై” వంటి పద్యాలతో కష్టజీవి కష్టాల గురించి, వారి అనుభవించిన బాధలను వారి కవిత్వంలో చక్కగా విశదీకరించారు. ఈ కోవలోనే 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ పురస్కారాన్ని అందుకున్నా ఆయన కష్టజీవుల పక్షానే నిలిచారు. జాషువా సత్య హరిశ్చంద్ర నాటకంలో “స్మశానవాటికలో జాషువా

 

Post midle

స్మశానవాటికలో కవి హృదయం ఈ విధంగా ఘోషిస్తుంది. “ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోనఁ గజగిఁపోయె! యిచ్చోట; నే భూములేలు రాజన్యుని యధికారముద్రిక అంతరించే యిచ్చోట నే లేఁత యిల్లాలి నల్లపూసల సౌరు, గంగలోఁగలిసిపోయె! యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ, నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాదు రంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు.” ఈ నేలలో కవి, రాజు, లేత యిల్లాలి మాంగల్యం, చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!. సృష్టికి లయకారుడు శివుడు. ఆయనకిష్టమైనది తాండవం. అట్టి శివతాండవానికి అనువైనది ఈ స్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచరగణంతో నాట్యమాడు రంగస్థలమంటున్నడు కవి. అంతేకాదు. ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడిదతో చేసిన సింహాసనమట! ఎంతలోతు భావం కవిది, ఇంకా ఈ విధంగా అంటాడు.. “ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ, దక్కటా! యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు

 

ఈ స్మశానవాటికలో కొన్ని వందల, వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరు

కూడా లేచి రాలేదు కదా! అంటూ ప్రారంభించాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు. ఈ రుద్రభూమిలో తమబిడ్డలను, పోగొట్టుకున్న తల్లుల రోచనలతో నిండిన కన్నీళ్ళకు వల్లకాడులోని రాళ్లు. క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాడు. కవి హృదయం ఎంతగా తల్లడిల్లుతున్నదో చూడండి. ఈ విధంగా జాషువా సాహిత్య గొప్ప తనాన్ని కీర్తించారు. పై “ఇచ్చోటనే”, “ఎన్నోయేండ్లు గతించి పోయినవి” అనే పద్యాలు ఎత్తి పాడినచో ఎంతటి కర్కశుడు అయినా కరిగి పోవాల్సిందే. జాషువా కవిత్వం తీవ్రమైన అనుభూతిని కలిగిస్తుంది. వారి ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే.. జాషువ కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారు. ప్రజల్లో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించారు. సమాజంలో చెరగని ముద్ర వేశారు జాషువా. జాషువా తన సుదీర్ఘ కవితా ప్రస్థానంలో తన జీవనయానంలోని వేదనా భరితగాథల్ని కవిత్వంగా, పద్యాలుగా అల్లుకున్నాడు. సమతారాగం ఆలపించాడు. కులాన్ని నిరసించాడే గాని కులవాదిగా మారలేదు. అతని కవిత్వంలోని భాష, భావం జమిలిగా నడుస్తూ పాఠకుల్ని వెంటతీసుకెళ్తాయి. ప్రకృతి వర్ణనలో జాషువా శైలి ముచ్చట గొల్పుతుంది. వర్ణనలో స్వభావోక్తి ఉట్టిపడుతుంది. ఒక మానవతావాదిగా, ప్రకృతి ఆరాధకుడిగా, విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించే కవి తెలుగు సాహితీలోకంలో జాషువాకు ప్రత్యేక స్థానముంది. జాషువా కవిత్వం ఈ సమాజం ఇట్లా ఉండొద్దు. ఇట్లా ఉంటే

బాగుంటుందనే వరకు అజరామరంగా ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉంటుంది.

Post midle

Comments are closed.