The South9
The news is by your side.
after image

ఉచిత విద్యుత్.. నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం

post top

ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఈ రోజు సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా దీనిపై ఏపీ సీఎం జగన్ మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్‌కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని తెలిపారు. కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని.. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు, ప్రభుత్వానిదే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం ఉండదని అన్నారు. ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే 30-35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు చేస్తున్నామని అన్నారు. రబీ సీజన్‌ నుంచి పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు.

ఉచిత విద్యుత్ ఘనత వైఎస్ఆర్‌దే:
ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్ఆర్‌కు దక్కుతుందని సీఎం జగన్ తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ అని అన్నారు. అప్పుడు ఉచిత విద్యుత్‌ అంటే.. కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవడమేనని ఇదే చంద్రబాబుగారు ఎద్దేవా చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌ కుదరదు, సాధ్యంకాదని వాదన చేశారని.. ఉచితంగా కరెంటు ఇవ్వడమేంటని అపహాస్యం చేశారని అన్నరు. చివరకు బషీర్‌బాగ్‌లో కాల్పులకు దిగిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకురావడమే కాక, రైతులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తూ ప్రమాణస్వీకారం రోజు ఫైల్‌పై సంతకాలు చేశారని అన్నారు.

చంద్రబాబు పెట్టిన బకాయిలు చెల్లించాం: గత మార్చి 31, 2019 నాటికి చంద్రబాబుగారు ఉచిత విద్యుత్‌పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8వేల కోట్లు బకాయిపెట్టారని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ డబ్బు మొత్తం చెల్లించామని అన్నారు. ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్నిచర్యలూ తీసుకున్నామని సీఎం జగన్ మంత్రులతో అన్నారు. కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్తు రూపేణా ఎంత వాడుతున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందని…ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారని సీఎం జగన్ అన్నారు.

Post Inner vinod found

పెరగనున్న జవాబుదారీతనం:
నాణ్యమైన కరెంటు, పగటిపూట 9 గంటల కరెంటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చని తెలిపారు. దీనివల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయని..అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రతినెలా రైతుల ఖాతాలకు డబ్బు చేరుతుంది. అదే డబ్బు నేరుగా డిస్కంలకు వెళుతుందని తెలిపారు. దీనివల్ల చంద్రబాబుగారి ప్రభుత్వంలా బకాయిపెట్టే పరిస్థితులూ ఉండవని.. అలాగే స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావని అన్నారు. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుందని.. అందులో ఉచిత విద్యుత్త పథకంలో సంస్కరణలు ఒకటని సీఎం జగన్ అన్నారు.

అవగాహన కోసం కాల్ సెంటర్:
ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించబోమని.. రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారికి రెగ్యులరైజ్‌ కూడా చేస్తామని తెలిపారు. ఒక్క కనెక్షన్‌ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పామని వెల్లడించారు. విద్యుశ్‌ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్‌సెంటర్‌ కూడా పెడతామని… రైతులనుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఉన్న ప్రతి కనెక్షన్‌ కూడా కొనసాగుతుందని.. రైతులు ఎన్నియూనిట్లు కాలిస్తే, అన్ని యూనిట్లరూ ప్రభుత్వం డబ్బు ఇస్తుందని తెలిపారు. ప్రస్తుత సంస్కరణల వల్ల కౌలు రైతులకూ ఎలాంటి ఇబ్బందీ లేదని సీఎం జగన్ అన్నారు.

ఏప్రిల్ 1 నుంచి అమలు:
ఉచిత విద్యుత్తు పథకం కింద ప్రభుత్వం బదిలీచేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవని వివరించారు. మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయని… రైతులకు ఎలాంటి భారం ఉండదని అన్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమిటీలు ఉంటాయని..ఏడాదికి దాదాపు రూ.8వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్తుకోసం ఖర్చు అవుతుందని సీఎం జగన్ అన్నారు. దీనికయ్యే పూర్తిబాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఏటా రైతుకు దాదాపు రూ.49,600లకుపైగా ఉచిత విద్యుత్తు కింద ఖర్చు అవుతుందని తెలిపారు. ఉచిత విద్యుత్తు పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచమని చెప్పామని సీఎం జగన్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు, ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.

Post midle

Comments are closed.