
- మంత్రి మేకపాటి ఇలాకాలోనే ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు
- ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం..నా అదృష్టం : మంత్రి మేకపాటి
- ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక శకానికి తొలి అంకురం
- మెట్ట ప్రాంత కల..సాకారమైన వేళ
- సీఎం ఆలోచన..పరి’శ్రమ’ల మంత్రి ఆచరణతో ఇక పారిశ్రామిక విప్లవం
- మెట్ట ప్రాంత ప్రజల సాక్షిగా పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సెప్టెంబర్, 20; రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రాకుండా ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకేసిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వెనకే ఉండి తనను ముందుకి నడిపిస్తున్నారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులోని నారంపేట వద్ద పారిశ్రామిక పార్కుకు ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 173.67 ఎకరాలలో నిర్మించనున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వాడను సకల వసతులతో పూర్తి చేసి ‘ఆదర్శ పారిశ్రామిక వాడగా నిలబెట్టేందుకు వేగిరంగా చర్యలు చేపడతామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. తొలి దశలో 87 ఎకరాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రూ.400 కోట్ల పెట్టుబడితో ఫర్నిచర్, ప్లాస్టిక్ వంటి 60కి పైగా పరిశ్రమలు అక్కడ నెలకొల్పనున్నట్లు మంత్రి వివరించారు. తద్వారా ప్రత్యక్ష్యంగా 2000 మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్ష్యంగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. మొత్తంగా ఆత్మకూరు పారిశ్రామికవాడలో 3500 మందికి ఉపాధి ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
వీడియోలు, ఫోటోలను చూసిన మీ కళ్లు త్వరలోనే నిజాలను చూస్తాయి : మంత్రి మేకపాటి
రాబోయే రోజుల్లో పారిశ్రామికవాడ నిర్మాణాంతరం ఎలా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు మంత్రి వీడయో ప్రదర్శించి చూపించారు. వీడియోలో ఉన్నది ఉన్నట్లుగా ఏడాదిన్నరలోగా పారిశ్రామిక పార్కును చూస్తారని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు. చెప్పింది చెప్పినట్లు చేసి చూపడమే మా ప్రభుత్వ విధానమని మంత్రి పేర్కొన్నారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు గర్వించే స్థాయిలో భవిష్యత్ లో పారిశ్రామికాభివృద్ధి ఉండబోతుందని మంత్రి తెలిపారు. ఊహించని స్థాయిలో అభివృద్ధిగతంలోలాగా ఫోటోలు, వీడియోలకే పారిశ్రామిక అభివృద్ధి పరిమితం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి అన్నారు. ఆత్మకూరు పార్కులాగే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న అవకాశాలు, వసతులను ప్రతి నియోజకవర్గంలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ లలో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వెల్లడించారు.
నా అనువణువూ ఆత్మకూరు గురించే ఆలోచన : మంత్రి గౌతమ్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పగించిన కీలక శాఖలు, బాధ్యతల నేపథ్యంలో భౌతికంగా నియోజకవర్గానికి దూరమైనా..మనసులో మాత్రం ఎప్పుడూ ఆలోచనలుంటాయని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. “నేనెక్కడున్నా నియోజకవర్గంపై పాలనాపరంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తా” అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో సైతం ఎంత కుదరకపోయినా ఎంజీఆర్ హెల్ప్ లైన్, వర్చువల్ మీటింగుల రూపంలో మీమధ్య, మీతోనే అందుబాటులో ఉంటున్నానని మంత్రి వ్యాఖ్యానించారు.ఇకపై నియోజకవర్గం, జిల్లాకు మరింత దగ్గరగా ఉంటానన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరు: మంత్రి మేకపాటి

త్వరలోనే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో మెట్ట ప్రాంతం పచ్చని మాగాణమవడం ఖాయమన్నారు. చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకూ నీరందిస్తామన్నారు. పాదయాత్రలో చెప్పిన సోమశిల హామీని నెరవేర్చితీరుతానన్నారు. తద్వారా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరందించనున్నట్లు పేర్కొన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. అనంతరం, ఆత్మకూరు నియోజకవర్గ మహిళలకు ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకం ద్వారా 13.05 కోట్ల చెక్కును మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అందించారు.
ఉదయగిరికి ఓ పార్కు కావాలి : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
రాష్ట్ర యువత ఆశయాలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి, మంత్రి కృషి చేస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరిలోనూ ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని ఆయన కోరారు.
ఈ ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల శ్రీహరి నాయుడు,ఏఎంసీ ఛైర్మన్ అనసూయమ్మ, ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు హాజరయ్యారు.
Comments are closed.